Tejas fighter jet: తేజస్‌లో భారత్, జపాన్ వాయుసేన చీఫ్‌లు.. వీర్ గార్డియన్-2026లో ప్రత్యేక ఘట్టం!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌కు చెందిన తేలికపాటి యుద్ధవిమానం తేజస్ (Tejas)లో జపాన్ ఎయిర్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ అధిపతి జనరల్ టకెహిరో మొరిటా ప్రయాణించారు. ఆయనతో పాటు భారత వాయుసేన చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ కూడా తేజస్‌లో ప్రయాణించారు. ఆదివారం ఉదయం భారత్-జపాన్ ద్వైపాక్షిక వాయుసేన సంయుక్త విన్యాసాలు 'వీర్ గార్డియన్-2026'లో భాగంగా ఈ ప్రత్యేక ప్రయాణం జరిగింది. జోధ్‌పుర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి ఈ విన్యాసాలను నిర్వహించారు. తొలుత జపాన్ వాయుసేన అధిపతి జనరల్ టకెహిరో మొరిటా, భారత వాయుసేన చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ జోధ్‌పుర్ వాయుసేన స్థావరానికి చేరుకున్నారు. అనంతరం వారికి కేటాయించిన తేజస్ విమానాల వద్దకు వెళ్లారు.
వివరాలు
స్వయంగా తేజస్ విమానాన్ని నడిపిన అమర్ ప్రీత్ సింగ్
జపాన్ వాయుసేన అధిపతి భారత పైలట్‌తో కలిసి తేజస్ విమానంలో ప్రయాణించారు. మరోవైపు భారత వాయుసేన చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ స్వయంగా మరో తేజస్ విమానాన్ని నడిపారు.
ఈ సంయుక్త వైమానిక విన్యాసాల సందర్భంగా భారత్, జపాన్ తమ యుద్ధ వ్యూహాలను పరస్పరం పంచుకున్నాయి.
ఇరు దేశాల వాయుసేనల మధ్య సహకారం, సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేలా ఈ విన్యాసాలు కొనసాగుతున్నాయి.
వివరాలు
విన్యాసాల్లో పాల్గొన్న యుద్ధ విమానాలు
వీర్ గార్డియన్-2026లో భారత్ తరఫున సుఖోయ్-30 ఎంకేఐ, రఫేల్ ఫైటర్ జెట్, ఎల్‌సీఏ తేజస్ యుద్ధ విమానాలు పాల్గొన్నాయి.
జపాన్ ఎయిర్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (JASDF) తరఫున ఎఫ్-2ఏ ఫైటర్ జెట్ ఈ సంయుక్త విన్యాసాల్లో పాల్గొంది.
భారత్, జపాన్ వాయుసేనలు కలిసి నిర్వహిస్తున్న వీర్ గార్డియన్-2026లో ఇరు దేశాల అధిపతులు తేజస్ విమానాల్లో ప్రయాణించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.