Robotic firefighters: భారత సైన్యం అమ్ములపొదిలోకి 'స్వదేశీ' ఫైర్ ఫైటింగ్ రోబోలు..
ఈ వార్తాకథనం ఏంటి
'ఆత్మనిర్భర్ భారత్', 'వికసిత్ భారత్-2047' లక్ష్యాల సాధనకు అనుగుణంగా భారత సైన్యం మరో కీలక అడుగు ముందుకు వేసింది. రక్షణ రంగంలో దేశీయ సాంకేతికతను ప్రోత్సహించే ఉద్దేశంతో అమలులో ఉన్న 'ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్' (iDEX) పథకం కింద అత్యాధునిక అగ్నిమాపక రోబోలను కొనుగోలు చేయడానికి భారత సైన్యం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పంద ప్రక్రియ జనవరి 13, 2026న క్యాపబిలిటీ డెవలప్‌మెంట్ డైరెక్టరేట్‌లో జరిగింది. ఫైర్ ఫైటింగ్ రోబోల సరఫరా బాధ్యతలను 'స్వదేశీ ఎంప్రెసా ప్రైవేట్ లిమిటెడ్' సంస్థకు అప్పగిస్తూ ఆర్మీ అధికారులు సంతకాలు చేశారు.
vivaralu
త్రివిధ దళాల సమన్వయానికి స్పష్టమైన ఉదాహరణ
ఈ అగ్నిమాపక రోబోలను మొదటగా భారత నౌకాదళ అవసరాల కోసం iDEX ఫ్రేమ్‌వర్క్ కింద అభివృద్ధి చేశారు. నౌకాదళం నిర్వహించిన సింగిల్ స్టేజ్ కాంపోజిట్ ట్రయల్స్ (SSCT) విజయవంతంగా పూర్తికావడంతో, అదే నిబంధనలను ఉపయోగించుకొని భారత సైన్యం వీటిని కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఒక దళం కోసం రూపొందించిన iDEX ఉత్పత్తులను మరో దళం వినియోగంలోకి తీసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇది రక్షణ రంగంలో స్టార్టప్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే కాకుండా, త్రివిధ దళాల మధ్య సాంకేతిక సమన్వయాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోంది.
వివరాలు
రోబో సామర్థ్యాలు ఇవే
ఈ ఫైర్ ఫైటింగ్ రోబో ఒక చిన్న పరిమాణంలో ఉండే అత్యాధునిక అన్‌మ్యాన్డ్ గ్రౌండ్ వెహికల్. తీవ్రమైన అగ్నిప్రమాదాలు సంభవించిన సమయంలో, మానవులు చేరలేని ప్రమాదకర ప్రాంతాల్లో కూడా ఇది సమర్థవంతంగా పని చేయగలదు. సురక్షిత దూరం నుంచే మంటలను నియంత్రించే అవకాశం కల్పిస్తూ, క్లిష్ట పరిస్థితుల్లో సైనికుల ప్రాణాలను కాపాడే కీలక పాత్ర పోషిస్తుంది. రక్షణ రంగంలోని స్టార్టప్‌లు, ఆవిష్కర్తలను సైన్యంతో అనుసంధానించడంలో iDEX పథకం ప్రధాన భూమిక పోషిస్తోంది. ఇప్పటికే డెలివరీ పూర్తైన ప్రాజెక్టులపై అభివృద్ధి కొనసాగిస్తూనే, మరో 22 iDEX ప్రాజెక్టులను భారత సైన్యం ప్రస్తుతం ట్రయల్స్ దశకు తీసుకువెళ్లనుంది.