Shubhanshu Shukla : భారత వ్యోమగామి శుభాంశు శుక్లాకు అశోక చక్ర పురస్కారం
ఈ వార్తాకథనం ఏంటి
భారత వ్యోమగామి 'శుభాంశు శుక్లా'కు దేశంలోని అత్యున్నత సైనిక పురస్కారాల్లో ఒకటైన అశోక చక్రను ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఈ నెల 26న ఢిల్లీలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో శుభాంశు శుక్లాకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. అయితే ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామిగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించిన నేపథ్యంలో ఆయన అసాధారణ సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని ప్రకటించినట్లు సమాచారం.
Details
విజయవంతంగా అంతరిక్ష యాత్ర పూర్తి
భారత అంతరిక్ష రంగ ప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయిలో పెంచడంలో శుభాంశు కీలక పాత్ర పోషించారని రక్షణ, అంతరిక్ష వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గతేడాది నిర్వహించిన యాక్సియం-4 మిషన్‌లో భాగంగా శుభాంశు శుక్లా విజయవంతంగా అంతరిక్ష యాత్ర పూర్తి చేశారు. ఈ మిషన్‌లో అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్, పోలండ్‌కు చెందిన స్లావోస్జ్ ఉజ్నాన్స్‌కీ-విస్నియెస్కీ, హంగరీకి చెందిన టిబర్ కపులతో కలిసి ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అంతరిక్షంలో ఉన్న సమయంలో శుభాంశు శుక్లా పలు కీలక శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారు.
Details
వ్యోమగాముల మానసిక ఆరోగ్యంపై కూడా పరిశోధనలు
జీరో గ్రావిటీ పరిస్థితుల్లో మానవ కండరాలకు కలిగే నష్టంపై అధ్యయనం చేయడంతో పాటు, ఖగోళంలో మానవ జీర్ణవ్యవస్థ ఎలా పనిచేస్తుందన్న అంశంపై వీడియోను చిత్రీకరించారు. అంతేకాదు, అంతరిక్షంలో దీర్ఘకాలం గడిపే వ్యోమగాముల మానసిక ఆరోగ్యంపై కూడా పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల ద్వారా భవిష్యత్ మానవ అంతరిక్ష ప్రయాణాలకు అవసరమైన కీలక సమాచారాన్ని అందించిన శుభాంశు శుక్లా, భారత అంతరిక్ష శాస్త్రానికి గణనీయమైన సేవలందించారని నిపుణులు పేర్కొంటున్నారు.