Cyclone Arnab: ఏపీ తీరంలో ఇసుకలో కూరుకుపోయిన కార్గో నౌక.. 20 మందిని కాపాడిన కోస్ట్ గార్డ్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ తీరంలో తీవ్ర తుపాను ప్రభావంతో ప్రమాదంలో చిక్కుకున్న కార్గో నౌకలోని 20 మంది సిబ్బందిని ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) సురక్షితంగా రక్షించింది. 'అర్నాబ్' అతి తీవ్ర తుపాను కారణంగా సముద్రంలో నియంత్రణ కోల్పోయిన 'ఎంవీ సిగ్మా పెరల్' నౌక తీరానికి కొట్టుకొచ్చి ఇసుకలో చిక్కుకుపోయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, అల్లకల్లోలంగా ఉన్న సముద్రాన్ని సైతం లెక్కచేయకుండా కోస్ట్ గార్డ్ సిబ్బంది గురువారం సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 24 గంటలపాటు కొనసాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా 20 మందినీ కాపాడారు.
వివరాలు
నౌక ఇంజిన్‌లో సాంకేతిక సమస్య
మార్షల్ ఐలాండ్స్ జెండాతో ప్రయాణిస్తున్న 'ఎంవీ సిగ్మా పెరల్' కార్గో నౌక విశాఖపట్నం పోర్టులో సరుకును దించిన తర్వాత ఈ నెల 27న సింగపూర్‌కు బయలుదేరింది.
అయితే ప్రయాణం మధ్యలో 'అర్నాబ్' తుపాను ప్రభావానికి గురైంది. ఈ క్రమంలో నౌక ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది.
దీంతో నౌకపై నియంత్రణ కోల్పోయిన సిబ్బంది దాన్ని అదుపు చేయలేకపోయారు.
ఫలితంగా నౌక అంతర్వేది సమీపంలోని రవ్వా ఆయిల్ ఫీల్డ్ వద్దకు కొట్టుకొచ్చి తీరంలో ఇసుకలో కూరుకుపోయింది.
దీంతో అందులో ఉన్న 20 మంది సిబ్బంది ప్రమాదంలో చిక్కుకున్నారు.
వివరాలు
మొగల్తూరు గ్రామంలో తాత్కాలిక హెలిప్యాడ్ ఏర్పాటు
సమాచారం అందుకున్న వెంటనే ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు అప్రమత్తమయ్యారు.
సహాయక చర్యల కోసం 'సుజయ్' అనే ఆఫ్‌షోర్ పెట్రోల్ నౌకతోపాటు హెలికాప్టర్‌ను రంగంలోకి దించారు. సముద్రం తీవ్రంగా అల్లకల్లోలంగా ఉన్నప్పటికీ సహాయక చర్యలను కొనసాగించారు.
నౌకలో చిక్కుకున్న 20 మంది సిబ్బందిని హెలికాప్టర్ సాయంతో ఒక్కొక్కరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
ఈ ఆపరేషన్‌ను సమర్థంగా నిర్వహించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామంలో తాత్కాలిక హెలిప్యాడ్‌ను కూడా ఏర్పాటు చేశారు.
కేవలం 24 గంటల వ్యవధిలోనే రెస్క్యూ ఆపరేషన్‌ను పూర్తి చేసి, సిబ్బంది అందరినీ క్షేమంగా రక్షించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.