Narendra Modi: 2029 ఎన్నికల నాటికి మహిళల రిజర్వేషన్లు అమలు: ప్రధాని నరేంద్ర మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి మహిళలకు రిజర్వేషన్లు అమలవుతాయని దీంతో మన రాజ్యాంగం మరింత బలోపేతం అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆయన ఓ లేఖ రాసి సామాజిక మాధ్యమ వేదిక ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం వివిధ రంగాల్లో మహిళలు విశేషంగా రాణిస్తున్నారని ఆయన అన్నారు. అదే విధంగా చట్టసభల్లో కూడా మహిళల ప్రాతినిధ్యం పెరగాలని భావించి రిజర్వేషన్ల ప్రక్రియను ప్రారంభించామని వివరించారు. ఏప్రిల్ 16 నుంచి ప్రారంభమయ్యే మూడు రోజుల పార్లమెంట్ సమావేశాల్లో 'నారీ శక్తి వందనం అధినియమ్'కు సంబంధించి సవరణలు ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరిగినా అది దేశ మహిళలకు అన్యాయం చేసినట్టేనని స్పష్టం చేశారు.
వివరాలు
2029 లోక్‌సభ ఎన్నికల నాటికి మహిళల రిజర్వేషన్లు
2029 లోక్‌సభ ఎన్నికల నాటికి మహిళల రిజర్వేషన్లు అమలులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భారతదేశ మహిళలు తమ హక్కుల కోసం దీర్ఘకాలం వేచి ఉండాల్సిన అవసరం లేదని మోదీ పేర్కొన్నారు. చట్టసభల్లో మహిళల స్వరం మరింత బలంగా వినిపించే సమయం ఆసన్నమైందన్నారు. దీని వల్ల ప్రజాస్వామ్యం మరింత దృఢంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. రానున్న పార్లమెంట్ సమావేశం విజయవంతం కావాలని, రాజ్యాంగ సవరణ ఆమోదం పొందాలని దేశంలోని మహిళల ఆశీస్సులు కోరారు. ప్రతి ఒక్కరూ తమ ప్రాంత ప్రజాప్రతినిధులకు లేఖ రాసి సభలకు హాజరై ఈ చట్టానికి మద్దతు ఇవ్వాలని కోరాలని సూచించారు.
వివరాలు
లోక్‌సభ మొత్తం స్థానాల్లో మూడవ వంతు సీట్లు మహిళలకు
ఇప్పటికే 2023లో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో 'నారీ శక్తి వందనం అధినియమ్' రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు ఈ బిల్లులో సవరణలు కొనసాగుతున్నాయి. లోక్‌సభలో మొత్తం స్థానాల్లో మూడవ వంతు సీట్లను మహిళలకు కేటాయించాలని నిర్ణయించారు. ఈ ప్రకారం మొత్తం 816 స్థానాల్లో సుమారు 273 స్థానాలను మహిళలకు కేటాయించే విధంగా చట్టంలో మార్పులు చేయనున్నట్లు తెలిపారు.