బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాల అంశం; బ్రిటన్ మంత్రికి గట్టిగానే చెప్పిన జైశంకర్
దిల్లీ, ముంబయిలోని బీబీసీ ఆఫీసుల్లో ఆదాయపన్ను శాఖ సోదాల అంశం దేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే తాజా బీబీసీ ఆఫీసుల్లో సోదాలపై బ్రిటన్ మంత్రి అడిగిన ప్రశ్నకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో బ్రిటీష్ విదేశాంగ మంత్రి జేమ్స్ తెలివిగా బీబీసీ ఆఫీసుల్లో సోదాల విషయాన్ని లేవనెత్తారు. అయితే భారతదేశంలో పనిచేసే అన్ని సంస్థలు అక్కడి నిబంధనల ప్రకారం పనిచేయాలని జైశంకర్ కూడా గట్టిగానే బదులిచ్చారు. బీబీసీ అనుబంధ కంపెనీలు అంతర్జాతీయ పన్నులు, నదగు బదిలీలో జరిగిన అవకతవకలను తేల్చేందుకు ఈ సర్వేలు చేప్టటినట్లు ఐటీ అధికారులు సోదాల సమయంలో చెప్పారు.
బీబీసీకి అండగా నిలిచిన బ్రిటన్ ప్రభుత్వం
2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీ ప్రమేయం ఉందంటూ 'ఇండియా: ది మోదీ క్వచ్చన్' పేరుతో రెండు ఎపిసోడ్లతో కూడిన డాక్యుమెంటరీని బీబీసీ రూపొందించింది. ఆ డాక్యుమెంటరీ వీడియో లింకులపై కేంద్రం నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో బీబీసీ ఆఫీస్‌లపై ఐటీ దాడులు చేయడం గమనార్హం. దాడుల అనంతరం బ్రిటిష్ ప్రభుత్వం బీబీసీని సమర్థించింది. బీబీసీకి అండగా నిలబడుతామని పేర్కొంది. బీబీసీ వరల్డ్ సర్వీస్ చాలా ముఖ్యమైనదని తాము భావిస్తున్నట్లు కామన్వెల్త్, అభివృద్ధి కార్యాలయం పార్లమెంటరీ అండర్-సెక్రటరీ రూట్లీ అన్నారు. బీబీసీ తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తుందని, ప్రతిపక్షాన్ని కూడా ఎండగడుతుందని, దానికి ఆ స్వేచ్ఛ ఉందని రూట్లీ స్పష్టం చేశారు. భారత్‌తో సహా ప్రపంచ దేశాలు ఈ విషయాన్ని గ్రహించాలని చెప్పారు.