ఆస్ట్రేలియా చారిత్రక నిర్ణయం, కరెన్సీపై క్వీన్ ఎలిజబెత్ చిత్రం తొలగింపు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా చారిత్రాక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా 5డాలర్ల నోటుపై బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ II బొమ్మను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆమె ఫొటో స్థానంలో దేశ సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించేలా కొత్త డిజైన్‌తో కరెన్సీ నోటు తీసుకురానున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఫెడరల్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా వెల్లడించింది. నోటుకు మరో వైపు ఆస్ట్రేలియన్ పార్లమెంట్ బొమ్మ అలాగే ఉంటుందని స్పష్టం చేసింది. గత సంవత్సరం క్వీన్ ఎలిజబెత్ మరణం తర్వాత ఆస్ట్రేలియాలో రాజ్యాంగ రాచరికంపై విస్తృత చర్చ నడిచింది. 1999 ప్రజాభిప్రాయ సేకరణలో బ్రిటీష్ చక్రవర్తిని దాని దేశాధినేతగా కొనసాగించాలని మెజార్టీ ప్రజలు ఓటు రూపంలో చెప్పారు.
ఆస్ట్రేలియా రాజ్యాంగ మార్పుపై ప్రజాసేకరణ వేళ రిజర్వ్ బ్యాంక్ ప్రకటన
తల్లి క్వీన్ ఎలిజబెత్ మరణం తర్వాత కింగ్ చార్లెస్ III బ్రిటిష్ చక్రవర్తి అయ్యారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తో యునైటెడ్ కింగ్‌డమ్ వెలుపల ఉన్న 12 కామన్వెల్త్ దేశాలకు అధిపతిగా ఆయనే అయ్యారు. క్వీన్ ఎలిజబెత్ మరణం తర్వాత ఆమె స్థానంలో వచ్చిన కింగ్ చార్లెస్ III చిత్రాన్ని ఆస్ట్రేలియా కరెన్సీపై ముద్రిస్తారని అందరూ అనుకున్నారు. అలా చేసేది లేదని గతంలో ఆస్ట్రేలియా తేల్చిచెప్పింది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ అదే విషయాన్ని స్పష్టం చేసింది. రాజ్యాంగంలో మార్పు, స్థానికుల గుర్తింపుతో పాటు ప్రజల జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయాలపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం అధికార సెంటర్-లెఫ్ట్ లేబర్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.