
ట్విట్టర్ పై భారత సర్కార్ బెదిరించిందన్న డోర్సే.. అవన్నీ అబద్దాలేనని కేంద్రం కౌంటర్
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రజాస్వామ్యంపై ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే సంచలన వ్యాఖ్యలు చేశారు.
గతంలో దిల్లీలో జరిగిన రైతు నిరసనల నేపథ్యంలో యూనియన్ సర్కార్ తమను ఒత్తిడిలోకి నెట్టేసిందని డోర్సే విమర్శల వర్షం కురిపించారు.
ఈ మేరకు భారత్ లో ప్రజాస్వామ్య విలువల ఉనికిని జాక్ డోర్సే ప్రశ్నించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
భారత్ లో రైతు నిరసనలు తీవ్రస్థాయికి చేరుకున్న నేపథ్యంలో కేంద్రాన్ని విమర్శిస్తున్న అకౌంట్లను బ్లాక్ చేయాలని ట్విట్టర్‌కు అనేకసార్లు చెప్పారని ఆయన వివరించారు.
ఈ విషయంలో భారత్ సర్కార్ ట్విట్టర్‌ను పలుమార్లు ఒత్తిడికి గురిచేసిందన్నారు. తాము చెప్పినట్టు వినకపోతే ఒకదశలో సామాజిక మాధ్యమాన్ని సైతం దేశంలో నిషేధిస్తామని బెదిరించారన్నారు.
DETAILS
భారత సర్కార్ బెదిరింపులపై పెదవి విరిచిన డోర్సే
దిల్లీ నిరసనలపై అన్నదాతలకు వస్తున్న సానుకూల స్పందనలను ట్విట్టర్ నుంచి తొలగించాలని కేంద్రం అల్టిమేటంగా చెప్పిందని డోర్సే చెప్పారు. ఈ మేరకు బ్రేకింగ్ పాయింట్స్ అనే యూట్యూబ్ ఛానెల్‌కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.
మాట వినకుంటే ట్విట్టర్ ఉద్యోగుల ఇళ్లపై రైడ్స్ చేస్తామని బెదిరించి, ఒకదశలో రైడ్స్ కూడా చేసిందన్నారు. రైడ్స్ చేయడమే ఇండియా అని, అతిపెద్ద ప్రజాస్వామ్యదేశమని ఎద్దేవా చేశారు.
2020లో కేంద్రం ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ చట్టాలపై రైతులు జంగ్ సైరన్ మోగించారు. సదరు చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దాని రద్దుకు వరకు పోరాడారు. చివరకు సాక్షాత్తు దేశ ప్రధానే కదలివచ్చి చట్టాల రద్దుపై ప్రకటన చేశారు.
DETAILS
ట్విట్టర్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన భారత ప్రభుత్వం
మరోవైపు డోర్సే ఆరోపణలను కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కొట్టిపారేశారు. భారత ప్రభుత్వం ఒత్తిడి చేసిందన్న వ్యాఖ్యలను కేంద్రం పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
తాము ఎవరిపైనా రైడ్స్ చేయలేదని, బెదిరించలేదని చెప్పుకొచ్చిన కేంద్ర మంత్రి, భారత సార్వభౌమత్వాన్ని అంగీకరించి, ఇక్కడి చట్టాల మేర నడుచుకునేందుకు డోర్సే హయాంలోని ట్విట్టర్ కంపెనీయే నిరాకరించిదన్నారు.
2021 జనవరిలో జరిగిన రైతుల నిరసనల సందర్భంగా అనేక దుష్ప్రచారాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని తెలిపారు. వాటిలో నరమేధం లాంటి తీవ్రమైన అసత్య ప్రచారాలు సైతం ఉన్నాయని మంత్రి అన్నారు.
DETAILS
ట్విట్టర్ సహకారం అమెరికాకు ఒకలాగా భారత్ కు ఒకలాగా: కేంద్రమంత్రి
ఈ క్రమంలోనే తప్పుడు వార్తలు వ్యాపించకుండా భారత ప్రభుత్వం బాధ్యత తీసుకుందన్నారు. లేదంటే పరిస్థితులు మరింత దిగజారి ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందన్నారు
దేశీయంగా కార్యకలాపాలు చేసుకుంటన్న కంపెనీలు ఇక్కడి ప్రభుత్వ చట్టాలను అమలు చేయాల్సిందేనన్నారు. అలా అమలయ్యేలా చూసే హక్కు భారత్ ప్రభుత్వానికి ఉందన్నారు.
అమెరికాలోనూ దిల్లీ తరహ నిరసనలు చెలరేగినప్పుడు తప్పుడు సమాచార వ్యాప్తిని ట్విట్టర్ వెంటనే తొలగించిందని చెప్పిన మంత్రి,అలాంటి సంఘటనలే భారత్ లో జరిగితే పక్షపాతంగా వ్యవహరించారని ఎద్దేవా చేశారు.
డోర్సే హయాంలో ట్విట్టర్ ఓ వైపున భారత చట్టాలను ఉల్లంఘిస్తూ మరోవైపు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19లను సైతం విస్మరించిందన్నారు. అసత్య ప్రచారాలు ఆయుధాలుగా మారేందుకు ట్విట్టర్ దోహదం చేసిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.