Indian Ships: హర్మూజ్ నుంచి సురక్షితంగా భారత్ వైపు దూసుకొస్తున్న LPG ట్యాంకర్లు.. వీడియో విడుదల చేసిన కేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల మధ్య ఇరాన్ సరిహద్దులో ఉన్న హర్మూజ్ జలసంధి నుంచి భారత ఎల్పీజీ ట్యాంకర్ నౌకలు'పైన్‌గ్యాస్','జగ్ వసంత్'సురక్షితంగా బయటపడిన వీడియోను కేంద్ర ప్రభుత్వ వర్గాలు విడుదల చేశాయి. ఈ రెండు నౌకలు దేశవ్యాప్తంగా ఒకరోజు వినియోగానికి సరిపడేలా సుమారు 92,612టన్నుల వంటగ్యాస్‌ను తీసుకొస్తున్నాయి. లారక్,ఖేశ్మ్ ద్వీపాల మార్గంలో ప్రయాణించిన ఈ నౌకల్లో ఒకదానిలో 33మంది,మరొకదానిలో 22 మంది భారత నావికులు ఉన్నారు. హర్మూజ్ జలసంధిని దాటి అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించిన ఈ నౌకలు మార్చి 26 నుంచి 28 మధ్య భారత తీరానికి చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే శివాలిక్,నందాదేవి వంటి గ్యాస్ నౌకలు సురక్షితంగా భారత్‌కు చేరాయి.
వివరాలు
ఆ 6 ట్యాంకర్లు కూడా భారత్‌కు చేరితే..
తాజాగా మరో రెండు నౌకలు చేరడం వల్ల దేశ ఇంధన అవసరాలకు కొంత మేర ఊరట లభించనుంది. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ఎల్పీజీ కొరత ఏర్పడకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. పర్షియన్ గల్ఫ్‌లో నిలిచిపోయిన మరికొన్ని ట్యాంకర్లను హర్మూజ్ జలసంధి దాటించేందుకు ఇరాన్ అధికారులతో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చలు సానుకూలంగా ముగిస్తే ఇంకా 6 ట్యాంకర్లు భారత్‌కు చేరే అవకాశం ఉంది. అలా జరిగితే దాదాపు 3 లక్షల టన్నుల ఎల్పీజీ దేశానికి అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే భారత నౌకలకు దీర్ఘకాలిక హామీ లేకపోవడంతో, ఇరాన్‌తో నిరంతరం చర్చలు జరపాల్సిన పరిస్థితి కొనసాగుతోంది.
వివరాలు
ఆ 6 ట్యాంకర్లు కూడా భారత్‌కు చేరితే..
ఇరాన్‌లోని అంతర్గత పరిస్థితుల కారణంగా నౌకలకు అనుమతులు ఇవ్వడంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) నిర్ణయాలు ఆలస్యమవుతున్నాయి. ఇక తటస్థ దేశాల నౌకలు తమ అధికారులతో సమన్వయం చేసుకుంటూ హర్మూజ్ మార్గంలో ప్రయాణించవచ్చని ఇరానియన్ డిఫెన్స్ కౌన్సిల్ ఇప్పటికే ప్రకటించింది. భారత నౌకల విషయంలో కూడా ఇరాన్ అధికారులు సహకార ధోరణి చూపుతున్నారని కేంద్ర వర్గాలు వెల్లడించాయి.