Collide Two Boats: భారత నౌకాదళ నౌకలు ఢీ.. ఇద్దరు గల్లంతు..11 మంది సిబ్బంది సేఫ్..
గోవాలో భారతీయ ఫిషింగ్ బోట్ 'మార్తోమా',భారత నౌకాదళ నౌకలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటన గురువారం సాయంత్రం గోవా తీరానికి వాయువ్యంగా సుమారు 70 నాటికల్ మైళ్ల దూరంలో చోటు చేసుకుంది. బోట్‌లో మొత్తం 13 మంది సభ్యులు ఉండగా, వారిలో 11 మంది సురక్షితంగా బయటపడ్డారు. మరో ఇద్దరి కోసం నేటికీ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం తర్వాత భారత నౌకాదళం వెంటనే పెద్ద ఎత్తున సెర్చ్ అండ్ రెస్క్యూ (SAR) ఆపరేషన్‌ను ప్రారంభించింది. ఈ చర్యలో భాగంగా, ఆరు నౌకలు, విమానాలను మోహరించి గల్లంతైన వారిని గాలించడం మొదలుపెట్టారు.
ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించేందుకు విచారణ
ముంబైకి చెందిన మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ (MRCC) సాయంతో రెస్క్యూ చర్యలను మరింత వేగవంతం చేస్తున్నారు. సమీపంలోని నౌకలు, విమానాలను వెంటనే అప్రమత్తం చేసి, ప్రాణాలతో బయటపడిన వారిని తీరానికి చేర్చారు. ఈ ఆపరేషన్‌లో నేవీ నౌకలు, విమానాలతో పాటు ఇతర వనరులు కూడా పాల్గొన్నాయి. గోవా,ముంబై తీర ప్రాంతాల ఏజెన్సీలు కూడా సముద్ర భద్రతను కాపాడేందుకు పూర్తి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఘర్షణకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే, ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించేందుకు విచారణ జరుపుతామని నేవీ అధికారులు తెలిపారు.
మత్స్యకారుల ఆచూకీ కనుగొనడమే ప్రధాన లక్ష్యం
ప్రస్తుత పరిస్థితుల్లో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కనుగొనడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ ప్రమాదం సముద్ర భద్రతపై కీలకమైన ప్రశ్నలను లేవనెత్తగా, రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన తాజా వివరాలు త్వరలో వెలువడే అవకాశముందని నేవీ స్పష్టం చేసింది. నేవీ అధికారుల ప్రకారం, గల్లంతైన వారిని సురక్షితంగా రక్షించేందుకు అన్ని విధాలుగా కృషి కొనసాగుతోంది.