Iran warship: IRIS దేనా నుంచి డిస్ట్రెస్ కాల్.. వెంటనే స్పందించిన ఇండియన్ నేవీ
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీలంక తీరానికి సమీపంలోని ఇరాన్ యుద్ధ నౌక నుంచి డిస్ట్రెస్ కాల్ రావడంతో భారత నౌకాదళం వెంటనే సహాయక చర్యలు ప్రారంభించింది. శ్రీలంక తీరానికి సమీపంలో అమెరికా సబ్‌మరైన్ టార్పెడో దాడి కారణంగా ఇరాన్‌కు చెందిన IRIS దేనా యుద్ధ నౌక ఇబ్బందుల్లో పడినట్లు సమాచారం రావడంతో ఈ చర్యలు చేపట్టినట్లు నేవీ గురువారం వెల్లడించింది. నేవీ తెలిపిన వివరాల ప్రకారం, మార్చి 4 తెల్లవారుజామున కొలంబోలో ఉన్న మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ (MRCC) కు ఈ అత్యవసర సమాచారం అందింది. శ్రీలంక బాధ్యతలో ఉన్న ప్రత్యేక శోధన ప్రాంతంలో గాలే తీరానికి సుమారు 20 నాటికల్ మైళ్ల దూరంలో ఇరాన్ నౌక ఉన్నట్లు గుర్తించారు.
వివరాలు
గాల్లో నుంచి లైఫ్ రాఫ్ట్స్ వదిలే సామర్థ్యం ఉన్న విమానం సిద్ధం
ఈ సమాచారం అందిన వెంటనే భారత నౌకాదళం గాలింపు చర్యలు ప్రారంభించింది. అప్పటికే శ్రీలంక ప్రారంభించిన గాలింపు చర్యలకు సహకరించేందుకు భారతనేవీ ఒక దీర్ఘదూర సముద్ర పర్యవేక్షణ విమానాన్ని పంపింది. అదేవిధంగా గాల్లో నుంచి లైఫ్ రాఫ్ట్స్ వదిలే సామర్థ్యం ఉన్న మరో విమానాన్ని సిద్ధంగా ఉంచింది. అప్పటికే ఆ ప్రాంతానికి సమీపంలో విధుల్లో ఉన్న ఐఎన్‌ఎస్ తరంగిణి నౌకను వెంటనే గాలింపు చర్యలకు పంపారు. అలాగే కొచ్చినుంచి ఐఎన్‌ఎస్ ఇక్షాక్ నౌకను కూడా అక్కడికి తరలించారు.మిస్సింగ్ అయిన సిబ్బందిని వెతికే పనిలో భాగంగా మానవతా దృక్పథంతో ఈ నౌక అక్కడే కొనసాగుతుందని నేవీ తెలిపింది. ఇక శోధన-రక్షణ చర్యల్లో భారత నౌకాదళం,శ్రీలంక అధికారులతో కలిసి సమన్వయంగా పనిచేస్తున్నట్లు నేవీ స్పష్టం చేసింది.