LOADING...
INS Trikand: భారత నౌకాదళం సాహసం.. పైరేట్ల దాడిని తిప్పికొట్టిన ఐఎన్ఎస్ త్రికంద్
భారత నౌకాదళం సాహసం.. పైరేట్ల దాడిని తిప్పికొట్టిన ఐఎన్ఎస్ త్రికంద్

INS Trikand: భారత నౌకాదళం సాహసం.. పైరేట్ల దాడిని తిప్పికొట్టిన ఐఎన్ఎస్ త్రికంద్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2026
08:07 am

ఈ వార్తాకథనం ఏంటి

గల్ఫ్ ఆఫ్ ఆడెన్ సముద్ర జలాల్లో భారత నౌకాదళం మరోసారి తన అప్రమత్తతను, కార్యదక్షతను చాటుకుంది. బుధవారం అర్ధరాత్రి తర్వాత కీలకమైన సరుకుతో ప్రయాణిస్తున్న ఎమ్‌వీ గోల్డెన్ ఆర్సెనల్ అనే వాణిజ్య నౌకపై సముద్రపు దొంగలు దాడికి ప్రయత్నించారు. అయితే భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ త్రికంద్ వేగంగా స్పందించి ఆ ప్రయత్నాన్ని విజయవంతంగా అడ్డుకుంది. భారత్‌కు అత్యంత ప్రాధాన్యమైన సరుకును తరలిస్తున్న ఈ వాణిజ్య నౌకలో ఒక భారతీయ సిబ్బంది కూడా ఉన్నారు. పైరేట్లు నౌక వైపు వస్తున్నట్లు గుర్తించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. భద్రతా నిబంధనల ప్రకారం నౌకలోని సురక్షిత గదిలో (సేఫ్ రూమ్)కి వెళ్లి లోపలి నుంచి తలుపులు మూసుకుని ఆశ్రయం పొందారు.

వివరాలు 

రంగంలోకి దిగిన మార్కోస్ కమాండోలు

అనంతరం కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా తమపై ఉన్న ముప్పు గురించి భారత నౌకాదళానికి అత్యవసర సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే గల్ఫ్ ఆఫ్ ఆడెన్‌లో గస్తీ నిర్వహిస్తున్న భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ త్రికంద్ వేగంగా ఘటనాస్థలికి చేరుకుంది. భారత నౌకాదళ యుద్ధనౌక సమీపిస్తున్నట్లు గుర్తించిన సముద్రపు దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత భారత నౌకాదళానికి చెందిన ప్రత్యేక దళం మార్కోస్ (Marine Commandos) వాణిజ్య నౌక ఎమ్‌వీ గోల్డెన్ ఆర్సెనల్లోకి ప్రవేశించింది. నౌకను పూర్తిగా తనిఖీ చేసిన కమాండోలు సిబ్బంది క్షేమంగా ఉన్నారని నిర్ధారించారు. దీంతో సముద్రపు దొంగల దాడి ప్రయత్నం పూర్తిగా విఫలమై, భారత నౌకాదళం మరోసారి సముద్ర భద్రతలో తన సమర్థతను చాటుకుంది.

Advertisement