Page Loader
Spelling Bee: అమెరికా స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతి బాలుడి ఘన విజయం
అమెరికా స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతి బాలుడి ఘన విజయం

Spelling Bee: అమెరికా స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతి బాలుడి ఘన విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
May 31, 2025
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జాతీయ స్పెల్లింగ్‌ బీ పోటీల్లో భారత-అమెరికన్ విద్యార్థుల దూకుడు మరోసారి కనిపించింది. ఈసారి టెక్సాస్‌లో నివసించే, హైదరాబాద్ మూలాలున్న 13 ఏళ్ల ఫైజాన్ జాకీ విజేతగా నిలిచాడు. 21వ రౌండ్‌లో స్క్రిప్స్‌ నిర్వాహకులు అడిగిన ఫ్రెంచ్ పదం 'ఎక్లైర్‌సిస్‌మెంట్‌' (éclicissement) స్పెల్లింగ్‌ను ఆయన తడబడకుండా చెబుతూ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. జాకీ తుదిపోటీలో కాలిఫోర్నియాకు చెందిన మరో భారతీయ మూలాల విద్యార్థి సర్వజ్ఞ కదమ్‌పై విజయం సాధించాడు. ఈ పోటీలో ఇది జాకీకి నాలుగోసారి పాల్గొనడం. గతేడాది రన్నరప్‌గా నిలిచిన జాకీ, ఈసారి ఛాంపియన్‌గా మారాడు.

Details

50,000 డాలర్ల నగదు బహుమతి

విజేతగా నిలిచిన ఫైజాన్ జాకీకి 50,000 డాలర్ల నగదు బహుమతి, ట్రోఫీతో పాటు మెరియమ్ వెబ్‌స్టర్ సంస్థ నుంచి అదనంగా 2,500 డాలర్ల నగదు బహుమతి లభించింది. తన విజయాన్ని తల్లిదండ్రులు, హైదరాబాద్‌లో నివసిస్తున్న తన తాతయ్య, నానమ్మలకు అంకితం చేస్తున్నానని జాకీ భావోద్వేగంగా తెలిపాడు. 1925లో ప్రారంభమైన జాతీయ స్పెల్లింగ్ బీ పోటీల 100వ ఎడిషన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన జాకీ, ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. గతేడాది కూడా భారత మూలాల విద్యార్థి బృహత్‌సోనా (నల్గొండ మూలాలు) విజేతగా నిలిచాడు. ఇలా వరుసగా భారత సంతతి విద్యార్థుల విజయం ఈ పోటీలపై వారి ఆధిపత్యాన్ని మరోసారి రుజువు చేస్తోంది.