Vande Bharat Sleeper: అమృత్‌భారత్-2 రైళ్లలో టికెట్ రద్దుపై కఠిన నిబంధనలు
ఈ వార్తాకథనం ఏంటి
వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌లతో పాటు అమృత్‌భారత్-2 రైళ్లకు సంబంధించి టికెట్ల రద్దు నిబంధనలను రైల్వేశాఖ మరింత కఠినంగా మార్చింది. సాధారణ రైళ్లలో అయితే రైలు బయల్దేరే సమయానికి నాలుగు గంటల లోపు టికెట్లు రద్దు చేస్తే ప్రయాణికులకు ఎలాంటి రీఫండ్ ఉండదని నిబంధనలు చెబుతున్నాయి. అయితే వందేభారత్ స్లీపర్ రైళ్ల విషయంలో ఈ గడువును ఎనిమిది గంటలుగా నిర్ణయిస్తూ రైల్వేశాఖ ఈ నెల 16న అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదే విధానం తాజాగా ప్రవేశపెడుతున్న అమృత్‌భారత్-2 రైళ్లకూ వర్తిస్తుందని రైల్వే అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ రెండు ప్రత్యేక రకాల రైళ్లలో ప్రతి ప్రయాణికుడికీ తప్పనిసరిగా ఖరారైన బెర్తు ఉండాలనే నిబంధన ఉండటమే ఇందుకు కారణమని వారు తెలిపారు.
వివరాలు
ఈ నెల నుంచి అమృత్‌భారత్-2
సాధారణ రైళ్లలో ఒక కుటుంబంలో ఆరుగురు సభ్యులుంటే, ముగ్గురికే బెర్తులు ఖరారైనా మిగిలిన వారు వారితో సర్దుకుని కూర్చుని ప్రయాణం చేయగలరు. కానీ వందేభారత్ స్లీపర్ లేదా అమృత్‌భారత్-2 రైళ్లలో అలాంటి అవకాశం ఉండదని, ఆ కుటుంబంలో ఆరుగురికీ బెర్తులు దొరకడమో లేదా ఎవరికీ దొరకకపోవడమో మాత్రమే జరుగుతుందని రైల్వే వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నెల నుంచి ప్రారంభిస్తున్న అమృత్‌భారత్ రైళ్లను ఇకపై అమృత్‌భారత్-2గా పిలవనున్నట్లు అధికారులు తెలిపారు.
వివరాలు
టికెట్ రద్దు చేస్తే..
ఈ కొత్త రైళ్లలో బెర్తు బుక్ చేసుకుని ప్రయాణానికి 72 గంటలకంటే ఎక్కువ సమయం మిగిలి ఉండగానే టికెట్ రద్దు చేస్తే, మొత్తం టికెట్ ధరలో 25 శాతం రుసుము కోల్పోవాల్సి ఉంటుంది. అలాగే ప్రయాణానికి 8 గంటల నుంచి 72 గంటల మధ్యలో టికెట్‌ను రద్దు చేస్తే 50 శాతం వరకు నష్టం వాటిల్లుతుంది. ఇతర సాధారణ రైళ్ల విషయంలో మాత్రం ప్రయాణానికి 12 గంటల నుంచి 48 గంటల లోపు రద్దు చేస్తే 25 శాతం, 12 గంటల నుంచి 4 గంటల లోపు రద్దు చేస్తే 50 శాతం రుసుము కట్ అవుతుందని రైల్వే నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.