Page Loader
Man Arrested For Spying Pak : భారత రహస్య సమాచారం పాక్‌కు లీక్‌.. గుజరాత్‌లో వ్యక్తి అరెస్ట్‌
భారత రహస్య సమాచారం పాక్‌కు లీక్‌.. గుజరాత్‌లో వ్యక్తి అరెస్టు

Man Arrested For Spying Pak : భారత రహస్య సమాచారం పాక్‌కు లీక్‌.. గుజరాత్‌లో వ్యక్తి అరెస్ట్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
May 24, 2025
04:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో దేశ భద్రతకు భంగం కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. సరిహద్దు భద్రతా దళం (BSF), భారత వైమానిక దళం (IAF)కు చెందిన అత్యంత రహస్య సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేసిన వ్యక్తిని ఉగ్రవాద నిరోధక దళం (ATS) అరెస్ట్ చేసింది. అరెస్టైన వ్యక్తిని సహ్‌దేవ్ సింగ్ గోహిల్‌గా గుర్తించారు. ఇతడు ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. గుజరాత్ ఏటీఎస్ ఎస్పీ కే సిద్ధార్థ్ వివరాల ప్రకారం, 2023 జూన్, జూలై మధ్య కాలంలో గోహిల్‌కు 'అదితి భరద్వాజ్' అనే పేరుతో ఓ మహిళ వాట్సాప్‌లో పరిచయమైంది. అనంతరం ఆమె పాకిస్థాన్‌కు చెందిన గూఢచారి అని గోహిల్‌కు తెలుసొచ్చింది.

Details

ఫోటోలు, వీడియోలు పంపినట్లు నిర్ధారణ

అయినా ఆమె అభ్యర్థన మేరకు కొత్తగా నిర్మిస్తున్న బీఎస్‌ఎఫ్‌, ఐఏఎఫ్‌ సైట్‌లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వాట్సాప్ ద్వారా పంపినట్లు అధికారులు తెలిపారు. 2025 ప్రారంభంలో గోహిల్ తన ఆధార్ కార్డు ఆధారంగా ఓ కొత్త సిమ్ కార్డును తీసుకున్నాడు. ఆ సిమ్‌ను ఉపయోగించి పాక్‌ మహిళా గూఢచారితో వాట్సాప్‌ చాట్ కొనసాగించాడు. అనంతరం ఆమెకు భారత రక్షణ సదుపాయాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు పంపినట్లు ఏటీఎస్ స్పష్టం చేసింది. ఈ సమాచారం చెల్లింపుగా గోహిల్‌కు గుర్తు తెలియని వ్యక్తి రూ.40,000 నగదు ఇచ్చినట్లు అధికారులు ధృవీకరించారు.

Details

మహిళా గూఢచారి పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

ఈ కేసులో మే 1న గోహిల్‌ను విచారణ కోసం పిలిపించి ప్రశ్నించామని, అనంతరం అతడిని అరెస్ట్ చేసినట్లు ఏటీఎస్‌ ఎస్పీ తెలిపారు. గోహిల్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపినట్లు వెల్లడించారు. గోహిల్‌తోపాటు పాకిస్థాన్ మహిళా గూఢచారి పై సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.