Indian ship: ఒమన్ తీరంలో భారత నౌక మునక.. 14 మందిని రక్షించిన అధికారులు
ఈ వార్తాకథనం ఏంటి
ఒమన్ తీరంలో భారత పతాకంతో ప్రయాణిస్తున్న 'ఎంఎస్‌వీ విరాట్ 1' నౌక మెకానికల్ వైఫల్యం కారణంగా మునిగిపోయింది. అయితే నౌకలో ఉన్న 14 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ విషయాన్ని ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. నౌక మునిగిపోయిన వెంటనే సహాయక చర్యలు చేపట్టగా, అందులోని సిబ్బందిని సురక్షితంగా రక్షించినట్లు తెలిపింది. ప్రస్తుతం వారందరూ క్షేమంగానే ఉన్నారని పేర్కొంది.
వివరాలు
స్వదేశానికి చేర్చేందుకు అవసరమైన ఏర్పాట్లు
రక్షించబడిన సిబ్బందిని ముంబయి వైపు ప్రయాణిస్తున్న 'ఎంవీ జబల్ అలీ' అనే మరో రవాణా నౌకలో ఎక్కించినట్లు భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. వారిని స్వదేశానికి చేర్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా, భారతీయ సిబ్బంది రక్షణ చర్యల్లో తాము కూడా సహకరించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించింది. సకాలంలో చేపట్టిన సహాయక చర్యల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అందరినీ కాపాడగలిగినట్లు అధికారులు పేర్కొన్నారు.