LOADING...
Russia: ప్రపంచవ్యాప్తంగా భారతీయ విద్యార్థుల ఫిర్యాదుల్లో 50 శాతానికి పైగా రష్యా నుంచే.. 
ప్రపంచవ్యాప్తంగా భారతీయ విద్యార్థుల ఫిర్యాదుల్లో 50 శాతానికి పైగా రష్యా నుంచే..

Russia: ప్రపంచవ్యాప్తంగా భారతీయ విద్యార్థుల ఫిర్యాదుల్లో 50 శాతానికి పైగా రష్యా నుంచే.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 10, 2026
02:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

రష్యాలో ఇటీవల నలుగురు భారతీయ విద్యార్థులు కత్తి దాడిలో గాయపడిన ఘటన మరోసారి అక్కడ చదువుతున్న విద్యార్థుల భద్రతపై ఆందోళనను పెంచింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తాజా గణాంకాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా నమోదైన భారతీయ విద్యార్థుల దోపిడీ, జాతి వివక్ష ఫిర్యాదుల్లో 50 శాతానికి పైగా రష్యా నుంచే రావడం గమనార్హం. టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించిన వివరాల మేరకు, 2025లో 196 దేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులు సుమారు 350 ఫిర్యాదులు నమోదు చేయగా,వాటిలో 200కుపైగా ఒక్క రష్యా నుంచే వచ్చాయి. 2023లో 68గా ఉన్న ఫిర్యాదులు 2024లో 78కి, 2025లో ఒక్కసారిగా 201కి చేరడం అధికారులతో పాటు విద్యార్థి సంఘాలను ఆందోళనకు గురి చేసింది.

వివరాలు 

విద్యార్థులు ఫిర్యాదులు చేయడానికే ముందుకు రావడం లేదు 

తక్కువ ఫీజులు, సులభమైన అడ్మిషన్ల కారణంగా.. ముఖ్యంగా మెడికల్ కోర్సుల కోసం.. రాజస్థాన్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి విద్యార్థులు రష్యాకు వెళ్తున్నప్పటికీ, భద్రత, సంక్షేమంపై ప్రశ్నలు పెరుగుతున్నాయి. అక్కడ చదువుతున్న భారతీయ విద్యార్థుల మాటల్లో, ఇతర దేశాలకు చెందిన విద్యార్థుల నుంచి వివక్ష, వేధింపులు నిత్యమైపోయాయని, చిన్నచిన్న తప్పులకే యూనివర్సిటీలు ఎక్స్‌పల్షన్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాయని తెలిపారు. ప్రతీకారం ఎదురవుతుందన్న భయం, వీసా సమస్యలు తలెత్తుతాయన్న ఆందోళన, కాలేజీ నుంచి బహిష్కరణ జరిగిపోతుందన్న సందేహాలతో చాలామంది విద్యార్థులు ఫిర్యాదులు చేయడానికే ముందుకు రావడం లేదని వారు తెలిపారు.

వివరాలు 

నిబంధనల ప్రకారం సుమారు 200 మంది విదేశీ విద్యార్థులకే అనుమతి

ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ (FMG) సంఘాల ప్రతినిధులు జాతి ప్రొఫైలింగ్, మాటల దూషణ, సంస్థాగత మద్దతు లేకపోవడం తరచూ జరుగుతోందని ఆరోపించారు.ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకోరని, యూనివర్సిటీలు విద్యార్థులను పక్కన పెడతాయని ఆల్ ఎఫ్‌ఎమ్‌జీల కోఆర్డినేటర్ డి. కౌశల్ అన్నారు. నిబంధనల ప్రకారం సుమారు 200 మంది విదేశీ విద్యార్థులకే అనుమతి ఉన్నా, కొన్ని సంస్థలు 1,200 మందికిపైగా చేర్చుకుని, ఆ తర్వాత ఆరవ ఏడాదిలో కూడా నిబంధనలకు విరుద్ధంగా బహిష్కరిస్తున్నాయని, దీంతో విద్యార్థులు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు.

Advertisement

వివరాలు 

తగ్గిన రష్యా ఆకర్షణ

ఈ పరిస్థితుల నేపథ్యంలో కజకస్తాన్, కిర్గిజ్‌స్తాన్ వంటి దేశాల వైపు భారతీయ విద్యార్థులు మొగ్గు చూపుతున్నారని, ఇటీవలి సంవత్సరాల్లో రష్యాను ఎంచుకునే వారి సంఖ్య కనీసం 50 శాతం తగ్గిందని ఎఫ్‌ఎమ్‌జీల అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు మనోజ్ కుమార్ చెప్పారు. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా ఆకర్షణ తగ్గిందని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, విదేశాల్లో భారతీయులు ఎదుర్కొంటున్న దోపిడీపై లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు స్పందించిన విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్, విద్యార్థుల సహాయం కోసం విదేశాల్లోని భారత మిషన్లలో ప్రత్యేక అధికారులను నియమించామని, అక్కడ చదువుతున్న భారతీయ విద్యార్థులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ ఎదురయ్యే సవాళ్లు, ముప్పులపై వారికి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

Advertisement