Page Loader
Indian Students: ఇరాన్‌లో ప్రాణభయంతో విలవిలలాడుతున్న భారత విద్యార్థులు
ఇరాన్‌లో ప్రాణభయంతో విలవిలలాడుతున్న భారత విద్యార్థులు

Indian Students: ఇరాన్‌లో ప్రాణభయంతో విలవిలలాడుతున్న భారత విద్యార్థులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 16, 2025
03:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఆ దేశ ప్రజలతోపాటు అక్కడ ఉన్న భారతీయుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా వైద్య విద్య కోసం ఇరాన్‌కు వెళ్లిన భారత విద్యార్థులు నరకం అనుభవిస్తున్నారు. పేలుళ్ల భయం, మిసైల్‌ దాడుల భీకరత మధ్య జీవనమరణ పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వాన్ని తక్షణమే తమను స్వదేశానికి తరలించాల్సిందిగా వేడుకుంటున్నారు.

Details

నిద్రపోకుండా మూడు రోజులు

జూన్‌ 12న ప్రారంభమైన ఇజ్రాయెల్‌ బాలిస్టిక్ దాడుల తరువాత పరిస్థితి మరింత దారుణంగా మారిందని ఇరాన్‌లోని భారతీయ వైద్య విద్యార్థులు చెబుతున్నారు. షాహిద్‌ బెహెష్టి యూనివర్సిటీలో మూడో సంవత్సరం ఎంబీబీఎస్‌ చదువుతున్న 22 ఏళ్ల ఇంతిసాల్‌ మొహిదీన్‌ మాట్లాడుతూ శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటలకు పేలుళ్ల శబ్దాలతో లేచాము. వెంటనే బేస్‌మెంట్‌లోకి పరుగులు తీశాం. అప్పటి నుంచి నిద్ర లేకుండా గడుపుతున్నామని తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఒక్క తన విశ్వవిద్యాలయంలోనే 350 మందికి పైగా భారతీయ విద్యార్థులు ఉన్నారు. హాస్టల్స్‌, అపార్ట్‌మెంట్లకు కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే బాంబు దాడులు జరుగుతున్నాయన్న సమాచారం వెలువడడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.

Details

'బయటకి రావాలంటేనే భయమేస్తోంది'

కెర్మాన్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో మొదటి సంవత్సరం చదువుతున్న ఫైజాన్‌ నబీ మాట్లాడుతూ.. తెహ్రాన్‌ కంటే కెర్మాన్‌ కొద్దిగా సురక్షితంగా ఉన్నప్పటికీ భయభ్రాంతులు మాత్రం వ్యాపిస్తున్నాయని తెలిపారు. "ఈరోజే మా నగరంలో తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి. టెహ్రాన్‌లోని స్నేహితులు భయంతో వణికిపోతున్నారు. కొన్ని రోజుల సరిపడ తాగునీటిని నిల్వ పెట్టుకోవాలని చెప్పారని పేర్కొన్నారు.

Details

'బతికే ప్రయత్నంలో ఉన్నాం'

శ్రీనగర్‌కు చెందిన ఫైజాన్‌ మాట్లాడుతూ, రోజూ పది సార్లు తల్లిదండ్రుల నుంచి ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. "ఇంటర్నెట్‌ చాలా నెమ్మదిగా ఉంది. మెసేజ్‌లు సరిగ్గా వెళ్లట్లేదు. మేం డాక్టర్లు కావడానికి ఇక్కడికి వచ్చాం.. కానీ ఇప్పుడు బతికే ప్రయత్నం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 'మమ్మల్ని ఇంటికి పంపించండి' ఇరాన్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో నాలుగో సంవత్సరం చదువుతున్న మిధాట్‌ మాట్లాడుతూ, మొదటి రాత్రి దాడులు చాలా భయానకంగా అనిపించాయన్నారు. "పేలుళ్లు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే జరిగాయి. అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. ఈ పరిస్థితి ఎప్పుడు ముగుస్తుందో తెలియడం లేదన్నారు. విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు పెద్దగా మద్దతు ఇవ్వట్లేదని చెప్పిన మిధాట్‌, భారత రాయబార కార్యాలయం ద్వారానే సలహాలు తీసుకుంటున్నామన్నారు.

Details

భారత రాయబార కార్యాలయ స్పందన

ఈ నేపథ్యంలో టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులకు సూచనలు జారీ చేసింది. ఇంట్లోనే ఉండాలని, అధికారిక సమాచారం కోసం విశ్వసనీయ మార్గాలను మాత్రమే అనుసరించాలని సూచించింది. హెల్ప్‌లైన్‌ నెంబర్లు కూడా విడుదల చేసింది. భారత ప్రభుత్వం ఇరాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నదని, భారతీయ విద్యార్థుల తరలింపుపై ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. వాయు మార్గాలు తాత్కాలికంగా మూసివేసినప్పటికీ, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తరలింపుకు ఇరాన్‌ అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి ఇరాన్‌లో ఉన్న భారత విద్యార్థులు ఎలాంటి అపాయం జరగకముందే తమను సురక్షితంగా వెనక్కి తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నారు. దేశం తరఫున తగిన చర్యలు తీసుకొని తమ ప్రాణాలను రక్షించాలంటూ వేడుకుంటున్నారు.