LOADING...
USA: యూఎస్‌లో అండర్‌గ్రాడ్యుయేట్స్‌ పెరుగుదల.. పీజీ స్టూడెంట్స్‌ తగ్గుదల
యూఎస్‌లో అండర్‌గ్రాడ్యుయేట్స్‌ పెరుగుదల.. పీజీ స్టూడెంట్స్‌ తగ్గుదల

USA: యూఎస్‌లో అండర్‌గ్రాడ్యుయేట్స్‌ పెరుగుదల.. పీజీ స్టూడెంట్స్‌ తగ్గుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 07, 2026
09:00 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల భారత్‌పై టారిఫ్‌ల విషయంలో గట్టిగా వ్యవహరించినా, రెండు దేశాల మధ్య సంబంధాలు కొంత సడలినట్టు కనిపించినా... ఉన్నత చదువుల కోసం అమెరికాను ఆశ్రయించే భారత యువత సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ప్రతి ఏడాది కొత్త రికార్డులు నమోదవుతూనే ఉన్నాయి. 2021-22లో అమెరికాలో అండర్‌గ్రాడ్యుయేట్‌ డిగ్రీ కోర్సుల్లో చేరిన భారత విద్యార్థులు 27,545 మంది కాగా, 2022-23లో ఈ సంఖ్య 31,954కు చేరింది. 2023-24లో 36,053 మంది చేరగా, 2024-25 నాటికి ఈ సంఖ్య 40,135కి పెరగడం గమనార్హం.

వివరాలు 

43.40 శాతం కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులే.. 

అమెరికాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో కోర్సుల ఎంపికలోనూ ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. అక్కడికి వెళ్లిన విద్యార్థుల్లో 43.40 శాతం మంది కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులనే ఎంచుకోవడం విశేషం. ఇంజినీరింగ్‌ కోర్సుల్లో 22 శాతం మంది చేరగా, సోషల్‌ సైన్సెస్‌ వైపు వెళ్లినవారు కేవలం 2.60 శాతం మాత్రమే. ఇక ఇంజినీరింగ్‌ కోర్సుల్లో అత్యధికంగా 44.40 శాతం మంది ఇరాన్‌ విద్యార్థులే చేరినట్టు నివేదిక వెల్లడించింది. ఈ వివరాలన్నీ అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులపై తాజాగా విడుదలైన 'ఓపెన్‌ డోర్స్‌-2025' నివేదికలో వెల్లడయ్యాయి.

వివరాలు 

భారత విద్యార్థుల్లో 65శాతం కంటే ఎక్కువ మంది కంప్యూటర్‌ సైన్స్‌, ఇంజినీరింగ్‌ కోర్సులకే ప్రాధాన్యం

సైన్స్‌,టెక్నాలజీ,ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌(స్టెమ్‌) కోర్సుల్లో ఆసియా దేశాల విద్యార్థులే ఎక్కువగా ప్రవేశాలు పొందుతున్నారని,యూరప్‌ నుంచి వచ్చే విద్యార్థులు మాత్రం ఒత్తిడి తక్కువగా ఉండే కోర్సుల్ని ఎక్కువగా ఎంచుకుంటున్నారని వరల్డ్‌ వైడ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ కెరియర్స్‌ సంస్థ ఎండీ యు. వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. భారత్‌లో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ)లో సైన్స్‌,ఇంజినీరింగ్‌ అంశాలు కలిపి బోధిస్తారు. అయితే అమెరికాలో ఈ రెండు విభాగాలు వేర్వేరుగా ఉంటాయి. అందుకే యూఎస్‌లో ఎంఎస్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో చేరాలనుకునే భారత విద్యార్థులు ముందుగా కంప్యూటర్‌ సైన్స్‌కు సంబంధించిన ఒకటి రెండు అదనపు సబ్జెక్టులు చదువుతుంటారు. మొత్తం మీద అమెరికాలో చదువుతున్న భారత విద్యార్థుల్లో 65శాతం కంటే ఎక్కువ మంది కంప్యూటర్‌ సైన్స్‌, ఇంజినీరింగ్‌ కోర్సులకే ప్రాధాన్యం ఇస్తున్నారు.

Advertisement

వివరాలు 

తగ్గుతున్న పీజీ విద్యార్థుల సంఖ్య

ఉన్నత విద్య కోసం భారత విద్యార్థులు ఎక్కువగా టెక్సాస్‌, న్యూయార్క్‌, మసాచ్యుసెట్స్‌, కాలిఫోర్నియా,ఇల్లినోయిస్‌ రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసుకుంటున్నారు. వీరిలో 63.10 శాతం మంది ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేరగా, 36.90 శాతం మంది ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో చేరుతున్నారు. అండర్‌గ్రాడ్యుయేట్‌ స్థాయిలో భారత విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, పీజీ విద్యార్థుల సంఖ్య మాత్రం 1,96,567 నుంచి 1,77,892కి తగ్గింది. ఇదిలా ఉండగా, చదువు పూర్తయ్యాక ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ)లో చేరిన భారతీయుల సంఖ్య భారీగా పెరిగింది. గతంలో 97,556గా ఉన్న ఈ సంఖ్య ఇప్పుడు ఏకంగా 1,43,740కు చేరడం మరో విశేషంగా నివేదిక స్పష్టం చేసింది.

Advertisement