IndiGo: ఇండిగో విమాన రద్దులు: 9,55,591 టికెట్లు రద్దు, రూ.1,397 కోట్ల రీఫండ్
ఈ వార్తాకథనం ఏంటి
ఇండిగో విమాన సర్వీసుల్లో ఏర్పడిన అంతరాయం కారణంగా నవంబర్ 21 నుంచి డిసెంబర్ 1 వరకు మొత్తం 9,55,591 టికెట్లు రద్దయ్యాయని పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. ఈ రద్దుల నేపథ్యంలో ప్రయాణికులకు దాదాపు రూ.827 కోట్ల మేర రీఫండ్ చేసినట్లు తెలిపింది. అలాగే డిసెంబర్ 1 నుంచి 7 వరకు మరో విడతగా 5,86,705 టికెట్లు రద్దుకాగా, వాటికి సంబంధించిన రూ.570 కోట్లను ప్రయాణికులకు తిరిగి చెల్లించినట్లు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. విమాన సర్వీసుల రద్దుల వల్ల దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో సుమారు 9,000 బ్యాగేజీలు నిలిచిపోయాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
వివరాలు
రిఫండ్ ప్రక్రియ వేగవంతం
వీటిలో ఇప్పటికే 4,500బ్యాగులను ప్రయాణికులకు చేరవేశారు. మిగిలిన సరుకులను వచ్చే 36 గంటల్లో పంపిణీ చేయేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇండిగో సంస్థ వెల్లడించింది. సోమవారం ఒక్కరోజే మొత్తం 500విమాన సర్వీసులు రద్దైనట్లు సమాచారం ఇచ్చింది. ఇదిలా ఉండగా, సర్వీసుల పునరుద్ధరణను నిరంతరం పర్యవేక్షించేందుకు తమ మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ప్రత్యేకంగా 'క్రైసిస్ మేనేజ్‌మెంట్ గ్రూప్'ను ఏర్పాటు చేసినట్లు ఇండిగో తెలిపింది. ఈ నిర్ణయం డిసెంబర్ 4న జరిగిన బోర్డు సమావేశంలో తీసుకున్నట్లు వెల్లడించింది. విమాన కార్యకలాపాలను పూర్తిస్థాయిలో మళ్లీ సాధారణ స్థితిలోకి తీసుకురావడం,ప్రయాణికులకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడం,రిఫండ్ ప్రక్రియను వేగవంతం చేయడం, అలాగే నిలిచిపోయిన బ్యాగేజీలను ప్రయాణికులకు త్వరితగతిన చేరవేయడంపై ఈ గ్రూప్ ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది.