
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల పథకం.. లబ్ధిదారుల కోసం కొత్త టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ ప్రారంభం!
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. నిర్మాణ దశల వారీగా లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పనులు పూర్తయ్యాక గృహప్రవేశాలు కూడా జరుగుతున్నాయి. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఈ పథకం అమలు అవుతోంది. ప్రతి సెగ్మెంట్‌లో సుమారు 3,500 ఇళ్లు నిర్మించనున్నారు. మొదటి విడతలో ఎంపికైన లబ్ధిదారుల ఇళ్లు ఇప్పటికే నిర్మాణ దశలోకి వెళ్లాయి. దరఖాస్తులను అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే లబ్ధిదారులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నిర్మాణ పనుల్లోనూ కచ్చితమైన పర్యవేక్షణ కొనసాగుతుండగా, చిన్న తప్పిదం జరిగినా బిల్లుల చెల్లింపులు నిలిపివేస్తున్నారు. కొంతమంది లబ్ధిదారులు వేగంగా పనులు పూర్తి చేస్తుండగా, మరికొందరు ఆలస్యంగా ముందుకు సాగుతున్నారు.
Details
పేమెంట్ వివరాలను తెలుసుకొనేందుకు ఆన్ లైన్ ఆప్షన్లు
ప్రభుత్వ ప్రకటన ప్రకారం ప్రతి సోమవారం బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయి. అయితే చాలామంది లబ్ధిదారులు తమ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయా లేదా తెలుసుకోవడానికి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అదనంగా కొందరికి టెక్నికల్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ ఇటీవలే ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ వెబ్‌సైట్‌లో పలు మార్పులు చేసింది. నిర్మాణ పురోగతి, బిల్లుల పేమెంట్ వివరాలు సులభంగా తెలుసుకునేలా ఆన్‌లైన్ ఆప్షన్లు కల్పించింది.
Details
ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు
తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రవేశపెట్టింది. ఇకపై లబ్ధిదారులు ఎదుర్కొనే సందేహాలు, ఫిర్యాదుల పరిష్కారానికి టోల్‌ఫ్రీ నంబర్ 1800 599 5991 అందుబాటులోకి వచ్చింది. ఇవాళ్టి నుంచి ఈ నంబర్ పనిచేయనుంది. ఈ హెల్ప్‌లైన్ అన్ని పని దినాల్లో అందుబాటులో ఉంటుంది. ప్రజలు, లబ్ధిదారులు చేసే ఫిర్యాదులు, ప్రశ్నలను అధికారులు వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు గృహ నిర్మాణశాఖ వెల్లడించింది.