LOADING...
Colombo airport: చెన్నై నుంచి సమాచారం.. శ్రీలంక ఎయిర్‌పోర్టులో భారీ సెర్చ్‌ ఆపరేషన్
చెన్నై నుంచి సమాచారం.. శ్రీలంక ఎయిర్‌పోర్టులో భారీ సెర్చ్‌ ఆపరేషన్

Colombo airport: చెన్నై నుంచి సమాచారం.. శ్రీలంక ఎయిర్‌పోర్టులో భారీ సెర్చ్‌ ఆపరేషన్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 03, 2025
08:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాం ఉగ్రదాడిలో పాల్పడినవారిని పట్టుకునేందుకు భద్రతా దళాలు విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ అందించిన సమాచారంతో శ్రీలంక రాజధాని కొలంబో ఎయిర్‌పోర్టులో పెద్దఎత్తున తనిఖీలు జరిగాయి. పహల్గాం దాడిలో పాల్గొన్నట్లు అనుమానిస్తున్న ఆరుగురు చెన్నై నుంచి శ్రీలంక వెళ్ళే విమానం ఎక్కి ఉండొచ్చని భారత ప్రభుత్వం తెలిపింది. ఈ అనుమానంతో శ్రీలంక ఎయిర్‌లైన్స్‌కు చెందిన UL122 విమానం బండారునాయికే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరిన వెంటనే తనిఖీలు మొదలయ్యాయి. ఈ ఆపరేషన్‌లో శ్రీలంక పోలీసులు, ఎయిర్‌ఫోర్స్, ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ అధికారులు సంయుక్తంగా పాల్గొన్నారు. చెన్నై ఏరియా కంట్రోల్ సెంటర్ నుంచి వచ్చిన హెచ్చరిక ఆధారంగా ఈ తనిఖీలు జరిగినట్లు విమానయాన సంస్థ వెల్లడించింది.

Details

ఏప్రిల్ 15న పహల్గాంలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు

అయితే తనిఖీల్లో ఎలాంటి అనుమానితులూ గుర్తించకపోవడంతో విమానానికి తదుపరి కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారు. ఇక ఏప్రిల్ 22న పహల్గాం ప్రాంతంలోని బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు కిరాతక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అనంతరం భద్రతా ఏజెన్సీలు దర్యాప్తును ముమ్మరం చేశాయి. టెర్రరిస్టులకు భూమిస్థాయిలో సహకరించిన ఓవర్‌గ్రౌండ్ వర్కర్లను విస్తృతంగా అరెస్టు చేశారు. దర్యాప్తులో ఒకరు వెల్లడించిన వివరాల ప్రకారం, ఉగ్రవాదులు ఏప్రిల్ 15న పహల్గాంలోకి ప్రవేశించారు.

Details

భద్రతా ఏజెన్సీల నిఘాలో అనుమానితులు

అనంతరం వారు బైసరన్ వ్యాలీ, అరు వ్యాలీ, స్థానిక అమ్యూస్‌మెంట్ పార్క్, బేతాబ్ వ్యాలీ ప్రాంతాల్లో నాలుగు రెక్కీలు నిర్వహించారు. అయితే చాలా ప్రాంతాల్లో భద్రతా బలగాలు మోహరించడంతో వారు దాడులను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఈ దాడికి సహకరించినవారిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గుర్తించింది. వీరిలో కొంతమందిని ఇప్పటికే అరెస్టు చేయగా, మిగతా అనుమానితులు భద్రతా ఏజెన్సీల నిఘాలో ఉన్నారు. ఈ ఘటనల నేపథ్యంలో భారత్, శ్రీలంక భద్రతా సంస్థలు మరింత అప్రమత్తమయ్యాయి.