CV Anand: ఆవిష్కరణలే పోలీసింగ్‌కు దిక్సూచి.. డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
నేరాల స్వరూపం వేగంగా మారుతున్న నేపథ్యంలో కృత్రిమ మేధ (ఏఐ)తో పాటు ఆధునిక సాంకేతికతల ఆధారంగా రూపొందుతున్న ఆవిష్కరణలే భవిష్యత్ పోలీసింగ్‌కు దిక్సూచిలా నిలుస్తాయని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. తెలంగాణ పోలీసులు దేశంలో ముందంజలో ఉండాలంటే క్రిమినల్ నెట్‌వర్క్ ట్రాకింగ్ సిస్టమ్ (సీసీటీఎన్‌ఎస్), ఇంటర్‌ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్)లను నిరంతరం అప్‌డేట్ చేస్తూ సమర్థంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో అన్ని విభాగాల పోలీసు అధికారులతో నిర్వహించిన సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్ కీలకోపన్యాసం చేశారు.
వివరాలు
ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారాన్ని జోడించాలి
పోలీసు శాఖలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక ఆధారిత అప్లికేషన్లను మరింత విస్తృతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు.
డిజిటల్ పోలీసింగ్ వ్యవస్థలోకి ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారాన్ని జోడిస్తూ ఉండాలని సూచించారు.
కోర్టు కేసుల నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను డీజీపీ ఆదేశించారు.
దర్యాప్తు, కోర్టు విధానాలు, న్యాయపరమైన అంశాలపై పోలీసులకు నిరంతరం శిక్షణ అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
వివరాలు
నేర నియంత్రణలో ప్రతిభ చూపిన విభాగాలకు ప్రశంసలు
రాష్ట్రస్థాయిలో నేర నియంత్రణకు సంబంధించిన ప్రమాణాల అమలులో ప్రతిభ కనబరిచిన పోలీసు విభాగాలను డీజీపీ అభినందించారు.
క్లస్టర్-1లో హైదరాబాద్, క్లస్టర్-2లో రామగుండం, క్లస్టర్-3లో నల్గొండ, క్లస్టర్-4లో సూర్యాపేట ప్రథమ స్థానాల్లో నిలిచాయి. దీంతో ఆయా పోలీసు విభాగాలకు చెందిన అధికారులను డీజీపీ సత్కరించారు.
ఏఐ ఆధారిత అప్లికేషన్లను రూపొందిస్తూ పోలీసు శాఖ అంతర్గత సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తున్న యువ ఐపీఎస్ అధికారుల సేవలను కూడా సీవీ ఆనంద్ కొనియాడారు.
వివరాలు
యువ ఐపీఎస్ అధికారులతో సమీక్ష
అనంతరం 2013 బ్యాచ్, ఆ తర్వాత బ్యాచ్‌లకు చెందిన ఐపీఎస్ అధికారులతో డీజీపీ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా నాయకత్వ లక్షణాలు, కొత్త చట్టాల అమలు, ఈ-సాక్ష్య, ఈ-ఫోరెన్సిక్, ఐసీజేఎస్ అనుసంధానం, జాతీయస్థాయి పోర్టళ్లలో తెలంగాణ పోలీసుల పనితీరును సమీక్షించారు.
ఈ సమావేశంలో డీజీపీలు మహేశ్‌భగవత్, సౌమ్యమిశ్రా, అభిలాష బిస్త్, శిఖాగోయెల్, చారుసిన్హా, హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఈగల్ డైరెక్టర్ సందీప్‌శాండిల్య తదితరులు పాల్గొన్నారు.