Pawan Kalyan: సనాతన ధర్మానికి సంబంధించిన డిక్లరేషన్ ప్రకటించిన పవన్.. కీలక అంశాలు ఇవే..!
తిరుపతిలో జరిగిన వారాహి డిక్లరేషన్ బహిరంగ సభలో సనాతన ధర్మానికి సంబంధించిన ప్రధాన డిక్లరేషన్‌ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా, ఆయన సనాతన ధర్మాన్ని పాటించే వారికి చట్టాలు ఎలా కఠినంగా ఉంటాయో, కానీ సనాతన ధర్మాన్ని దూషణ చేసే వారికి మాత్రం కోర్టులు రక్షణ కల్పిస్తాయని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ పేర్కొన్న అంశాల్లో, సనాతన ధర్మాన్ని విమర్శించే వ్యక్తుల పట్ల కోర్టులు మౌనం వహిస్తున్నాయని, కానీ ఇస్లాం వంటి మతాలపై వ్యాఖ్యలు చేసిన వెంటనే కోర్టులు స్పందిస్తున్నాయని చెప్పుకొచ్చారు. సనాతన ధర్మాన్ని కించపరచడం, దేవుళ్ళను అవమానించడం వంటి చర్యలపైనా కోర్టుల నుంచి ఎలాంటి ప్రతిస్పందన ఉండకపోవడాన్ని న్యాయవ్యవస్థలో లోపంగా ఆయన వివరించారు.
సనాతన ధర్మ డిక్లరేషన్స్
లౌకిక వాదం: ఏ మతం లేదా ధర్మానికి భంగం కలిగితే, లౌకిక వాదానికి అనుగుణంగా చట్టం ఒకే విధంగా స్పందించాలి. సనాతన ధర్మ రక్షణ చట్టం: సనాతన ధర్మాన్ని కాపాడేందుకు దేశం మొత్తం అమలు అయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం. దానిని వెంటనే తీసుకురావాలి. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు: జాతీయ,రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు బోర్డు ఏర్పాటు చేయాలి. ఆర్థిక నిధులు: సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు ప్రతి సంవత్సరం నిధులు కేటాయించాలి. ద్వేష ప్రసారాలను ఆపడం: సనాతన ధర్మాన్ని కించపరచే వ్యక్తులు, వ్యవస్థలకు సహాయం నిలిపివేయాలి.
సనాతన ధర్మాన్ని కాపాడే చర్యలకు పునాదులు
ఆలయ స్వచ్ఛత: ఆలయాలలో ఉపయోగించే నైవేద్యాలు, ప్రసాదాలకు సంబంధించిన వస్తువుల స్వచ్ఛతను ధృవీకరించే విధానాలు తీసుకురావాలి. ఆలయాల ప్రాధాన్యత: ఆలయాలను ఆధ్యాత్మిక కేంద్రాలతో పాటు, విద్య, కళలు, ఆర్థిక, పర్యావరణ పరిరక్షణ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ డిక్లరేషన్స్ ద్వారా సనాతన ధర్మాన్ని కాపాడే చర్యలకు పునాదులు వేసేలా పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాలను వెల్లడించారు.