Insurance Premium: ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్‌టీ మినహాయించాలి: భట్టివిక్రమార్క
ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుండి వచ్చే విరాళాలు, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్‌టీ మినహాయించాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం దిల్లీలో జరిగిన 54వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం తరపున ఆయన ఈ ప్రతిపాదన చేశారు.
ప్రీమియంలపై ప్రస్తుతం ఉన్న 18% పన్నును 5%కి తగ్గించాలి
"రీసెర్చ్ గ్రాంట్లు, ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థల నుండి వచ్చే విరాళాలు, వృద్ధులకు సంబంధించిన ఆరోగ్య బీమా ప్రీమియాలు జీఎస్‌టీ నుంచి మినహాయించాలి.ఇతర వయస్సుల వ్యక్తుల ప్రీమియంలపై ప్రస్తుతం ఉన్న 18% పన్నును 5%కి తగ్గించాలి. అధిక వైద్య ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మధ్యతరగతి మరియు దిగువ మధ్యతరగతి కుటుంబాలకు నచ్చిన ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందేలా, బీమా ప్రీమియంపై పన్ను పూర్తిగా మినహాయించాలి లేదా గణనీయంగా తగ్గించాలి" అని భట్టి కోరారు.
జీఎస్‌టీ కౌన్సిల్ మంత్రివర్గ ఉపసంఘంలో భట్టి
2015-16 ఆర్థిక సంవత్సరానికి అనుగుణంగా తెలంగాణకు 4.02% ఐజీఎస్‌టీ మొత్తాన్ని కేటాయించిన కేంద్రం, ఇప్పుడు మరో ఫార్ములా ప్రకారం 5.07% మేరకు రికవరీ చేస్తుండటంపై భట్టి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారంగా రాష్ట్రాలలో జీఎస్‌టీ రికవరీకి కమిటీ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. బీమా పాలసీలపై పన్ను విధించే విధానంపై మరింత స్పష్టత కోసం జీఎస్‌టీ కౌన్సిల్ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనుందని, తాను కూడా ఆ ఉపసంఘంలో సభ్యుడిగా ఉండబోతున్నట్లు భట్టి వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ కూడా పాల్గొన్నారు.