తీవ్రంగా మారుతున్న బిపోర్‌జాయ్ తుపాను; అరేబియాలో ఎగిసిపడుతున్న రాకాసి అలలు
తూర్పు-మధ్య అరేబియా సముద్రం మీదుగా బిపోర్‌జాయ్ తుపాను గత ఆరు గంటల్లో 7కి.మీ వేగంతో ఉత్తర దిశగా అత్యంత వేగంగా కదులుతోందని ఐఎండీ తెలిపింది. గుజరాత్ తీరం, ముంబైలో బలమైన గాలులు, రాకాసి అలలు ఎగిసి పడతుండటంతో బిపోర్‌జాయ్ తుపాను స్పష్టంగా కనిపించింది. ఈ తుపాను ప్రభావం పశ్చిమతీర రాష్ట్రాలైన గుజరాత్, మహారాష్ట్రపై ఎక్కువగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. గుజరాత్ లోని సౌరాష్ట్ర, కచ్‌లలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్)కి చెందిన ఏడు బృందాలను మోహరించారు. పోర్‌బందర్, దేవభూమి ద్వారక, జామ్‌నగర్, కచ్, మోర్బీ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 7,500 మందికి పైగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు
జూన్ 15 రెడ్ అలర్ట్ జారీ
బిపోర్‌జాయ్ తుపాను గురువారం మధ్యాహ్నం గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని జఖౌ ఓడరేవు సమీపంలో 'చాలా తీవ్రమైన తుఫాను'గా మారే అవకాశం ఉందని, గాలి గరిష్ట వేగం గంటకు 150 కిలోమీటర్ల వరకు ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. బిపోర్‌జాయ్ తుపాను నేపథ్యంలో గుజరాత్‌లోని అన్ని జిల్లాల్లో జూన్ 14న ఆరెంజ్ అలర్ట్, జూన్ 15న రెడ్ అలర్ట్ ప్రకటించింది. జూన్ 15 నుంచి తుపాను తీరం దాటుతుందని, ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ రోజు బిపోర్‌జాయ్ తుపాను తీరం దాటే ముందు, కచ్ తీర ప్రాంతాలలో 144 సెక్షన్ విధించారు. జూన్ 16వరకు ఆ సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు చెప్పారు.