Interim Budget 2024: ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేసిన నిర్మలా సీతారామన్
సార్వత్రిక ఎన్నికల వేళ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం 'మధ్యంతర బడ్జెట్ 2024(Interim Budget 2024)ను సమర్పించారు. నిర్మలా సీతారామన్ వరుసగా ఆరోసార బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. వరుసగా ఆరో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేశారు. నిర్మలా సీతారామన్ జులై 2019 నుంచి ఐదు పూర్తిస్థాయి బడ్జెట్‌లను పార్లమెంట్‌లో సమర్పించారు. స్వాతంత్ర్య భారతదేశంలో దేశానికి పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా పనిచేసిన తొలి మహిళ కూడా నిర్మలా సీతారామన్ కావడం గమనార్హం. 1970-71 ఆర్థిక సంవత్సరానికి ఇందిరా గాంధీ తర్వాత బడ్జెట్‌ను సమర్పించారు. భారత పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళ ఇందిరా గాంధీ కాగా.. రెండో మహిళ నిర్మలా సీతారామన్ కావడం గమనార్హం.
10సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మొరార్జీ దేశాయ్
గతంలో కేంద్ర ఆర్థిక మంత్రులుగా పని చేసిన మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్ సిన్హా విజయవంతంగా వరుసగా ఐదు బడ్జెట్‌లను సమర్పించారు. అయితే గురువారం 6వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్ సిన్హాను నిర్మల అధిగమించారు. ఇప్పటి వరకు మొరార్జీ దేశాయ్ మాత్రమే ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొరార్జీ దేశాయ్ 1959-1964 మధ్య ఐదు వార్షిక బడ్జెట్‌లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. ఆర్థిక మంత్రిగా ఆయన 10 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు ఆయన పేరిటే ఉంది.