
mangoes: తెలంగాణ మామిడికి అంతర్జాతీయ గుర్తింపు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మామిడిపండ్లను శుద్ధి చేసి, రైతుల ద్వారానే 'తెలంగాణ బ్రాండ్' పేరుతో విదేశాలకు ఎగుమతి చేయాలని ఉద్దేశిస్తోంది.
ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఉద్యానశాఖ రూ.35 కోట్లతో ప్రత్యేక ప్రతిపాదనలు రూపొందించింది. ప్రస్తుతం తెలంగాణ మామిడికి విదేశాల్లో మంచి ఆదరణ ఉంది.
రాష్ట్రంలో ఏటా సుమారు ఆరువేల టన్నుల మామిడికాయలు కాస్తున్నాయి. అయితే, వీటిలో వేయి టన్నుల వరకు మాత్రమే విదేశాలకు ఎగుమతవుతున్నాయి.
ఇప్పటి వరకు ప్రైవేటు కంపెనీలు మామిడిని కొనుగోలు చేసి ముంబయి, బెంగళూరులాంటి నగరాలకు తరలించి అక్కడ శుద్ధి చేసి, విదేశాలకు పంపిస్తూ లాభాలు పొందుతున్నాయి.
దీనిని మార్చేందుకు ప్రభుత్వం నేరుగా రైతుల ద్వారానే ఎగుమతులు జరగాలని నిర్ణయించింది.
Details
రూ.5 కోట్లతో వేపర్ హీట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్
ఈ నేపథ్యంలో, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ఉద్యానశాఖ అధికారులు శుద్ధి సదుపాయాల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించారు.
ఇందులో భాగంగా
మామిడిపై ఉండే పురుగులను తొలగించేందుకు రూ.24 కోట్లతో అటామిక్ రీసెర్చ్ ఎనర్జీ యంత్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.
మామిడిని మెరిసేలా చేసేందుకు రూ.5 కోట్లతో వేపర్ హీట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను స్థాపించనున్నారు.
మామిడిని మగ్గబెట్టేందుకు రూ.3 కోట్లతో హాట్‌వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు.
మామిడిని నిల్వ చేయడానికి రూ.4 కోట్లతో కోల్డ్ రూమ్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.
ప్యాకింగ్ అవసరాల కోసం ఇంటిగ్రేటెడ్ ప్యాక్‌హౌస్ ఏర్పాటు చేయడానికి రూ.2 కోట్లు ఖర్చు చేయనున్నారు.
Details
రైతులకు లాభాలు చేకూరే అవకాశం
బాటసింగారం పండ్ల మార్కెట్‌తో పాటు ఇతర ముఖ్య ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాల కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
ఇక కోహెడలో అంతర్జాతీయ మార్కెట్ ప్రారంభమైన తర్వాత, అక్కడ పదికి పైగా ప్యాక్‌హౌస్‌లను ఏర్పాటుచేసేందుకు కూడా ఉద్యానశాఖ ప్రణాళిక రూపొందిస్తోంది.
ఈ చర్యలతో తెలంగాణ మామిడికి అంతర్జాతీయంగా మరింత గుర్తింపు లభించనుండటమే కాకుండా, రైతులకు నేరుగా లాభాలు చేకూరే అవకాశం ఉంది.