
GNU: ఉత్తారంధ్రలో జార్జియా నేషనల్ యూనివర్శిటీ క్యాంపస్ ఏర్పాటు.. నారా లోకేష్ సమక్షంలో ఒప్పందాలు
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రంలో విద్యార్థులకు మెరుగైన ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో ఉత్తరాంధ్రలో ప్రఖ్యాత అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించేందుకు జార్జియా నేషనల్ యూనివర్సిటీ (GNU), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఈ ఒప్పందంపై GNU ప్రతినిధులు, ఏపీ ప్రభుత్వ అధికారులతో కలిసి సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ప్రకారం, జిఎన్ యు సుమారు రూ.1,300 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. అంతేగాక, ఈ ప్రాజెక్ట్ వల్ల 500 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి.
వివరాలు
అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా సంస్థ
ఈ ఒప్పందంతో, రాష్ట్రంలో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందుతుందని, విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు సహాయపడుతుందని నారా లోకేష్ అన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంతో పాటు, విద్యార్థులు గ్లోబల్ ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేలా ప్రత్యేక శిక్షణ అందిస్తామని తెలిపారు.
అంతర్జాతీయ స్థాయిలో ఏపీ విద్యా రంగాన్ని విశిష్టంగా నిలిపేందుకు ఇది ఉపకరిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
వివరాలు
ప్రధాన లక్ష్యాలు
ఈ భాగస్వామ్యం ద్వారా, జార్జియా నేషనల్ యూనివర్సిటీ (GNU) యొక్క పెట్టుబడులు, సాంకేతికత, ప్రణాళికా రూపకల్పన, ఆధునిక పరికరాలు వంటి అంశాలను ఉపయోగించుకోవడం జరుగుతుంది.
ఇందులో టెక్నాలజీ, బిజినెస్, హెల్త్‌కేర్ వంటి ముఖ్యమైన రంగాల్లో విద్యా ప్రోగ్రామ్‌లు అందించనున్నారు.
అధ్యాపకులు, విద్యార్థుల మధ్య జ్ఞాన మార్పిడి, పరిశోధన, నూతన ఆవిష్కరణలకు ఈ ఒప్పందం దోహదపడనుంది.
వివరాలు
విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే ప్రణాళిక
ఆధునిక విద్యా విధానాలను ప్రవేశపెట్టడం, పరిశ్రమ డిమాండ్లకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడం, ప్రపంచస్థాయి సంస్థలతో భాగస్వామ్యాన్ని పెంపొందించడం ఈ ఒప్పంద లక్ష్యాలలో ప్రధానమైనవి. GNU ద్వారా, MIT వంటి ప్రఖ్యాత యూనివర్సిటీలతో విద్యా సంబంధాలను బలోపేతం చేస్తారు.
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఫ్యాకల్టీ ప్రోగ్రామ్స్‌తో పాటు, ప్రముఖ కంపెనీలతో సహకారాన్ని పెంచి, విద్యార్థులకు ఉపాధి అవకాశాలను విస్తరించనున్నారు.
వివరాలు
జార్జియా నేషనల్ యూనివర్సిటీ (GNU) విశిష్టత
2002లో స్థాపితమైన జార్జియా నేషనల్ యూనివర్సిటీ SEU, జార్జియాలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా ప్రఖ్యాతి పొందిన ప్రైవేట్ యూనివర్సిటీలలో ఒకటిగా నిలిచింది. 1,100 మంది నైపుణ్యం కలిగిన అధ్యాపక సిబ్బందితో, 52,500 మంది పూర్వ విద్యార్థులను ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన కెరీర్‌ల వైపు నడిపించింది.
ఈ యూనివర్సిటీకి 4 అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఫ్యాకల్టీ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి.
అంతేగాక, పలు ప్రముఖ గ్లోబల్ కంపెనీలతో భాగస్వామ్యం కలిగి ఉండటంతోపాటు, విద్యార్థులకు ఫండింగ్‌తో కూడిన అంతర్జాతీయ మార్పిడి ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తోంది.
ఈ ఒప్పందం ద్వారా, రాష్ట్ర విద్యా రంగానికి నూతన ఒరవడిని తీసుకువచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇది భవిష్యత్తులో మరిన్ని అవకాశాలను సృష్టిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.