Page Loader
Air India Plane Crash report: పైలట్లు లేకుండానే దర్యాప్తు..? AAIB నివేదికపై ALFA తీవ్ర అసంతృప్తి
పైలట్లు లేకుండానే దర్యాప్తు..? AAIB నివేదికపై ALFA తీవ్ర అసంతృప్తి

Air India Plane Crash report: పైలట్లు లేకుండానే దర్యాప్తు..? AAIB నివేదికపై ALFA తీవ్ర అసంతృప్తి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 12, 2025
06:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(AAIB)విడుదల చేసిన ప్రాథమిక నివేదికను ఎయిర్‌లైన్స్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ALFA)తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నివేదికలో వాస్తవాల నిర్ధారణలో పారదర్శకత లేకుండా, పైలట్లపైనే దృష్టి కేంద్రీకరించి పక్షపాత ధోరణి అవలంబించారని అసోసియేషన్ అభిప్రాయపడింది. ఈ నివేదికపై ఏ అధికారిక వ్యక్తి సంతకం చేయలేదు. విచారణ పూర్తిగా గోప్యతతో సాగింది. ఇది మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. లైన్ పైలట్లు వంటి నిపుణులను ఈ దర్యాప్తులో భాగం చేయలేదని ALFA అధ్యక్షుడు సామ్ థామస్ విమర్శించారు. వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ నివేదికను ఉటంకిస్తూ, ప్రమాదానికి ఇంధన స్విచ్‌ల అనుకోని కదలికలే కారణమన్న అంశాన్ని ప్రస్తావించారు. ఇలాంటి సున్నితమైన సమాచారాన్ని మీడియాకు లీక్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

Details

15 పేజీలతో ప్రాథమిక నివేదిక

ఈ దర్యాప్తులో తమకూ పరిశీలకులుగా భాగస్వామ్యం ఇవ్వాలని ALFA కోరుతోంది. ఇక జూన్‌లో చోటుచేసుకున్న ఆ ఘోర విమాన ప్రమాదంపై AAIB సమర్పించిన 15 పేజీల ప్రాథమిక నివేదిక ప్రకారం.. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఇంధన నియంత్రణ స్విచ్‌లు 'రన్‌' స్థితి నుంచి 'కట్‌ఆఫ్‌' స్థితికి మారాయి. దీంతో విమానం నియంత్రణ కోల్పోయి కుప్పకూలినట్టు వివరించింది. ప్రమాదం జరిగిన క్షణాల ముందు ఒక పైలట్.. 'నీవెందుకు స్విచ్‌ ఆఫ్‌ చేశావ్‌?' అని ప్రశ్నించగా.. నేను స్విచ్‌ ఆఫ్‌ చేయలేదనే సమాధానం మరో పైలట్‌ ఇచ్చినట్లు నివేదిక పేర్కొంది. కాక్‌పిట్‌లో ఇదే ఇద్దరి మధ్య చివరి సంభాషణగా నమోదైనట్టు వెల్లడించింది.

Details

స్పందించిన కేంద్ర మంత్రి

ఈ నివేదికపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పందించింది. పౌర విమానయానశాఖ మంత్రి కె. రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ మనకు ప్రపంచంలోనే అత్యుత్తమ సిబ్బంది, పైలట్లు ఉన్నారు. వారు ఈ రంగానికి వెన్నెముక. ప్రమాదంపై తుది నివేదిక వచ్చే వరకు తాత్కాలికంగా ఏ నిర్ణయానికీ రావద్దు. ఇందులో పలు సాంకేతిక అంశాలు ఉన్నాయనీ, పూర్తి నివేదిక వెలువడిన తరువాతే స్పష్టత వస్తుందని వ్యాఖ్యానించారు.