Loading...
IPS Officer Bushra Bano: 'జైహింద్‌' అనలేదని పశ్చిమ బెంగాల్‌లో ఐపీఎస్‌ అధికారిణి బదిలీ.
'జైహింద్‌' అనలేదని పశ్చిమ బెంగాల్‌లో ఐపీఎస్‌ అధికారిణి బదిలీ

IPS Officer Bushra Bano: 'జైహింద్‌' అనలేదని పశ్చిమ బెంగాల్‌లో ఐపీఎస్‌ అధికారిణి బదిలీ.

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 15, 2026
12:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్‌లో ఐపీఎస్‌ అధికారిణి బుష్రా బానో బదిలీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. యూపీఎస్సీ అభ్యర్థులను ప్రోత్సహించేందుకు ఆమె విడుదల చేసిన ఓ మోటివేషనల్‌ వీడియో వివాదానికి దారితీసింది. ఆ వీడియోలో ఉపయోగించిన అభివాదాలపై ఓ హిందూ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసి రాష్ట్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది. ఈ పరిణామాల అనంతరం ఆమెను మరో విభాగానికి బదిలీ చేయడం చర్చకు కారణమైంది.

వివరాలు 

ఫిర్యాదు తర్వాతే బదిలీ.. కారణం ఏమిటి?

2021 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారిణి బుష్రా బానో ప్రస్తుతం ఖరగ్‌పూర్‌ అదనపు ఎస్పీగా పనిచేస్తున్నారు.

సోమవారం ఆమెను రాష్ట్ర సాయుధ పోలీసు దళం డిప్యూటీ కమాండెంట్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

అయితే,ఈ బదిలీకి ముందు ఆమెపై వచ్చిన ఫిర్యాదు,ఆ తర్వాత జరిగిన బదిలీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

సెప్టెంబర్‌ 13న బుష్రా బానో యూపీఎస్సీ అభ్యర్థులను ఉద్దేశించి ఓ వీడియో విడుదల చేశారు.

అందులో సివిల్‌ సర్వీసెస్‌కు తాను ఎలా సిద్ధమయ్యారో వివరించారు. అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ (AMU)లోని రెసిడెన్షియల్‌ కోచింగ్‌ అకాడమీ తన యూపీఎస్సీ ప్రిపరేషన్‌లో కీలకంగా ఉపయోగపడిందని చెప్పారు.

చదువుకు అవసరమైన స్టడీ మెటీరియల్‌, లైబ్రరీ, టెస్ట్‌ సిరీస్‌ వంటి సదుపాయాలు తనకు ఎంతో సహాయపడ్డాయని పేర్కొన్నారు.

వివరాలు 

అభివాదాలపై సోషల్‌ మీడియాలో విమర్శలు

అయితే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విమర్శలకు దారితీసింది. వీడియో ప్రారంభంలో 'అస్సలామువాలైకుమ్‌', మధ్యలో 'ఇన్‌షా అల్లా', చివర్లో 'జజాకల్లా' వంటి పదాలను బుష్రా బానో ఉపయోగించారు.

దీనిపై ఎక్స్‌ (గతంలో ట్విటర్‌)లో కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ప్రజా వేదికపై మాట్లాడినప్పుడు 'జైహింద్‌', 'వందేమాతరం' వంటి జాతీయ అభివాదాలను ఉపయోగించలేదని విమర్శలు వచ్చాయి.

ADVERTISEMENT

వివరాలు 

హిందూ లీగల్‌ ఫండ్‌ ఫిర్యాదు

ఈ వ్యవహారంపై 'హిందూ లీగల్‌ ఫండ్‌' అనే సంస్థ పశ్చిమ బెంగాల్‌ హోం సెక్రటరీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.

ప్రజా వేదికపై భారత ప్రభుత్వాన్ని ప్రాతినిధ్యం వహించే సర్వీసింగ్‌ అధికారి తటస్థంగా వ్యవహరించాలని, జాతీయ అభివాదాలను ఉపయోగించాలని కోరినట్లు పేర్కొంది.

ఈ అంశంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సంస్థ డిమాండ్‌ చేసింది.

బదిలీకి ఫిర్యాదే కారణమా?

ఫిర్యాదు వెలువడిన తర్వాత బుష్రా బానో బదిలీ కావడంతో ఈ రెండు పరిణామాల మధ్య సంబంధంపై చర్చ మొదలైంది.

అయితే ఆమె బదిలీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక వివరణ వెలువడలేదు.

ADVERTISEMENT

వివరాలు 

సౌదీ అరేబియా నుంచి సివిల్స్‌ వరకు..

దీంతో సోషల్‌ మీడియాలో జరుగుతున్న చర్చకు ఫిర్యాదే కారణమా? లేక ఇది సాధారణ పరిపాలనా బదిలీలో భాగమా? అనే ప్రశ్నలకు ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

బుష్రా బానో విద్యా, ఉద్యోగ ప్రస్థానం కూడా ఆసక్తికరంగా సాగింది. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌ జిల్లాకు చెందిన ఆమె అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీలో మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు.

నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (NET), జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ (JRF) కూడా సాధించారు.

వివాహం, కుటుంబ బాధ్యతల మధ్య కొంతకాలం సౌదీ అరేబియాలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు.

అనంతరం భారత్‌కు తిరిగి వచ్చి యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమయ్యారు. 2018లో యూపీఎస్సీలో 277వ ర్యాంక్‌ సాధించి ఇండియన్‌ రైల్వే ట్రాఫిక్‌ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు.

వివరాలు 

ఖరగ్‌పూర్‌ నుంచి సాయుధ పోలీసు దళానికి..

అయితే రెండో బిడ్డకు గర్భవతిగా ఉండటంతో ఆ పోస్టులో చేరలేకపోయారు. ఆ తర్వాత మరోసారి యూపీఎస్సీ పరీక్ష రాసి 2019లో 234వ ర్యాంక్‌ సాధించారు.

ఈసారి ఐపీఎస్‌కు ఎంపికై పశ్చిమ బెంగాల్‌ కేడర్‌కు కేటాయించబడ్డారు.

బుష్రా బానో తన కెరీర్‌లో తొలి పోస్టింగ్‌ను హుగ్లీ రూరల్‌ ఏఎస్పీగా చేపట్టారు. ఈ ఏడాది జూన్‌లో ఆమెకు అదనపు ఎస్పీగా పదోన్నతి లభించింది.

అనంతరం ఖరగ్‌పూర్‌ అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు.

తాజాగా ఆమెను రాష్ట్ర సాయుధ పోలీసు దళం డిప్యూటీ కమాండెంట్‌గా బదిలీ చేశారు. ఈ బదిలీ వెనుక కారణాలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

ADVERTISEMENT