Loading...
Telangana: వానాకాలం సాగుపై నీటిపారుదల శాఖ ప్రణాళిక.. ఏడు లక్షల ఎకరాలకు నీరు
వానాకాలం సాగుపై నీటిపారుదల శాఖ ప్రణాళిక.. ఏడు లక్షల ఎకరాలకు నీరు

Telangana: వానాకాలం సాగుపై నీటిపారుదల శాఖ ప్రణాళిక.. ఏడు లక్షల ఎకరాలకు నీరు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 20, 2026
09:44 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో 2026-27 వానాకాలం సీజన్‌లో సాగునీటి ప్రాజెక్టుల కింద సుమారు ఏడు లక్షల ఎకరాలకు నీరు అందించేలా నీటిపారుదల శాఖ ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీటి లభ్యతను అంచనా వేసి ఈ కేటాయింపులు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో గోదావరి బేసిన్‌ పరిధిలో 6,05,955 ఎకరాలు,కృష్ణా బేసిన్‌ కింద 95,108 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూసిన తర్వాత మిగిలే నీటి నిల్వలను మాత్రమే సాగు అవసరాలకు వినియోగించాలని నీటిపారుదల శాఖ అధికారులను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. రెండు రోజుల క్రితం జరిగిన సమీక్షలో మంత్రి ఈ మేరకు స్పష్టమైన సూచనలు చేసిన విషయం తెలిసిందే.

వివరాలు 

నిజాంసాగర్‌ ప్రాజెక్టు పరిధిలో 1.24 లక్షల ఎకరాలకు సాగునీరు

దీంతో అందుబాటులో ఉన్న నీటి వనరులు, ప్రాజెక్టుల పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఆయకట్టు వారీగా నీటి కేటాయింపులపై శాఖ అధికారులు కసరత్తు చేశారు.

ఈ క్రమంలో బుధవారం వానాకాలం సాగుకు సంబంధించిన ఆయకట్టు జాబితాను నీటిపారుదల శాఖ సిద్ధం చేసినట్లు తెలిసింది.

ఇందులో ప్రధాన ప్రాజెక్టులు, వాటి పరిధిలోని జిల్లాలు, సాగునీరు అందించాల్సిన ఆయకట్టు వివరాలను పొందుపరిచినట్లు సమాచారం.

నిజాంసాగర్‌ ప్రాజెక్టు పరిధిలో కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన సుమారు 1.24 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

అలాగే దేవాదుల ఎత్తిపోతల పథకం పరిధిలోని వరంగల్, ములుగు, హనుమకొండ, జనగామ జిల్లాల్లో సుమారు 2.74 లక్షల ఎకరాలకు నీటిని విడుదల చేయాలని ప్రణాళికలో పేర్కొన్నట్లు సమాచారం.

వివరాలు 

సూర్యాపేట జిల్లాకు మూడు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు

మూసీ నది పరిధిలో సూర్యాపేట జిల్లాకు చెందిన దాదాపు మూడు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని నీటిపారుదల శాఖ నిర్ణయించినట్లు తెలిసింది.

మొత్తంగా ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలను తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ, మిగిలిన నీటి లభ్యత మేరకు వానాకాలం పంటలకు సాగునీరు అందించేలా శాఖ ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం.

ADVERTISEMENT