Opinion Polls Survey: బెంగాల్‌లో మళ్లీ మమత హవా?.. తాజా సర్వే ఏం చెబుతోంది!
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. పశ్చిమ బెంగాల్‌తో పాటు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాల్లో మినీ ఎన్నికల సమరం నడుస్తోంది. మండుతున్న వేసవిని లెక్కచేయకుండా ప్రధాన రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. పరస్పరం నువ్వానేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. అయితే ఈ రాష్ట్రాలన్నింటిలోనూ పోటీ ఉన్నప్పటికీ, పశ్చిమ బెంగాల్‌లో మాత్రం రాజకీయ సమరం మరింత ఉత్కంఠగా మారింది. ఎలాగైనా ఈసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, తృణమూల్ కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని కసిగా ఉంది. ఈ నేపథ్యంలో తాజా ఒపీనియన్ పోల్స్ సర్వే ఆసక్తికర వివరాలను వెల్లడించింది.
వివరాలు
బీజేపీ పుంజుకొనే అవకాశం
పశ్చిమ బెంగాల్‌లో నిర్వహించిన వోట్‌వైబ్ సర్వే ప్రకారం, 294 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్‌కు 174-184 సీట్లు దక్కే అవకాశముందని అంచనా వేసింది. మెజారిటీ మార్క్ అయిన 148ను ఈజీగా దాటుతుందని తెలిపింది. దీంతో మమతా బెనర్జీ నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే అవకాశాలు బలంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ సర్వేలో 46.4 శాతం మద్దతుతో మమతా బెనర్జీ సీఎం రేసులో ముందంజలో ఉన్నారు. ఉద్యోగాలు, అభివృద్ధి అంశాలే ఓటర్ల ప్రధాన ఆందోళనలుగా వెల్లడయ్యాయి. ఇక బీజేపీ కూడా ఈసారి గణనీయంగా పుంజుకునే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. ఈ పార్టీకి 108-118 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
వివరాలు
బీజేపీకి 98-108 సీట్లు దక్కే ఛాన్స్
మరోవైపు కాంగ్రెస్, సీపీఎం వంటి పార్టీలు ఈసారి కూడా ప్రధాన పోటీలో నిలవలేకపోతున్నాయని, కేవలం 0-4 సీట్లతోనే సరిపెట్టుకునే పరిస్థితి కనిపిస్తోందని సర్వే తెలిపింది. మార్చి 23న విడుదలైన వోట్‌వైబ్ పూర్వ అంచనాలతో పోలిస్తే తాజా సర్వేలో మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పట్లో టీఎంసీకి 184-194 సీట్లు వస్తాయని, బీజేపీకి 98-108 సీట్లు దక్కుతాయని అంచనా వేయగా.. తాజా సర్వేలో టీఎంసీ సీట్ల అంచనా కొద్దిగా తగ్గి, బీజేపీ సీట్ల సంఖ్య పెరిగినట్లు వెల్లడైంది. గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే, 2021లో తృణమూల్ కాంగ్రెస్ 215 స్థానాలు గెలుచుకుని అధికారాన్ని నిలబెట్టుకోగా, బీజేపీ 77 స్థానాలను సాధించింది. ఆ ఎన్నికలు బీజేపీకి రాష్ట్రంలో కీలక మలుపుగా మారాయి.
వివరాలు
బీజేపీ బలమైన ప్రతిపక్షంగా నిలిచే అవకాశం
అయితే తాజా అంచనాలు నిజమైతే, మరోసారి టీఎంసీ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉండగా, బీజేపీ బలమైన ప్రతిపక్షంగా నిలిచే అవకాశముంది. ముఖ్యమంత్రి అభ్యర్థుల విషయంలో కూడా సర్వే స్పష్టత ఇచ్చింది. మమతా బెనర్జీ 46.4 శాతం మద్దతుతో అగ్రస్థానంలో ఉండగా, బీజేపీకి చెందిన సువేందు అధికారి 34.9 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన అధిర్ రంజన్ చౌదరి 3.2 శాతం, సీపీఎంకు చెందిన మహమ్మద్ సలీం 5.0 శాతం మద్దతుతో వెనుకబడ్డారు. ఇతరులు లేదా చెప్పలేము అనే వర్గం 5.5 శాతం ఓట్లు పొందింది.
వివరాలు
తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే అవకాశం
అదేవిధంగా మత, కుల ఆధారిత ఓటింగ్ ధోరణులు కూడా ప్రభావం చూపనున్నట్లు సర్వే పేర్కొంది. ముస్లిం ఓటర్లు టీఎంసీకి గట్టిగా మద్దతు ఇస్తున్నట్లు (60.9 శాతం) వెల్లడైంది. ఎస్సీ, ఎస్టీ వర్గాలు బీజేపీకి చెరో 50 శాతం మేర మద్దతు ఇస్తున్నాయి. అగ్రవర్ణ హిందువులు బీజేపీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని (46.8 శాతం), టీఎంసీకి 35.4 శాతం మద్దతు ఉందని సర్వే తెలిపింది. మొత్తానికి తాజా అంచనాల ప్రకారం పశ్చిమ బెంగాల్‌లో మరోసారి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉండగా, బీజేపీ బలమైన ప్రత్యర్థిగా నిలుస్తూ పోటీని మరింత ఉత్కంఠగా మార్చనుంది.