'గోవులను 'ఇస్కాన్' కసాయిలకు అమ్ముతోంది'.. మేనకా గాంధీ సంచలన ఆరోపణలు
ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్(ఇస్కాన్)పై బీజేపీ ఎంపీ మేనకా గాంధీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇస్కాన్‌ను అతిపెద్ద మోసకారిగా ఆమె అభివర్ణించారు. మేనకా గాంధీ చాలా ఏళ్లు జంతు హక్కుల కోసం పోరాడుతున్నారు. గోశాలలోని ఆవులను ఇస్కాన్ కసాయిలకు విక్రయిస్తుందని ఆరోపించారు. ఈ మేరకు ఆమె చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది. ఇస్కాన్ గోశాలలను నెలకొల్పుతుందని, ఆవుల నిర్వహణ కోసం భూముల రూపంలో ప్రభుత్వం నుంచి అపరిమిత ప్రయోజనాలను పొందుతుందని మేనక స్పష్టం చేసారు. తాను ఇటీవల ఇస్కాన్‌కు చెందిన అనంతపురంలోని గౌశాల (ఆంధ్రప్రదేశ్‌లో) సందర్శించినట్లు చెప్పారు. అక్కడ ఒక్క ఆవు కూడా మంచి స్థితిలో కనిపించలేదన్నారు. గోశాలలో దూడలు లేవని, వాటిని అమ్మేసినట్టు మేనకా గాంధీ ఆరోపించారు.
మేనకా గాంధీ ఆరోపణలను ఖండించిన ఇస్కాన్
మేనకా గాంధీ ఆరోపణలను ఇస్కాన్ తోసిపుచ్చింది. మేనకా గాంధీ ఆరోపణలు నిరాధారమైనవి, అబద్ధమని చెప్పింది. ఆమె ప్రకటనకు తాము ఆశ్చర్యపోయినట్లు ఇస్కాన్ పేర్కొంది. గొడ్డు మాంసం ప్రధాన ఆహారంగా ఉన్న ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో గోసంరక్షణకు ఇస్కాన్ మార్గదర్శకత్వం వహించిందని ఇస్కాన్ జాతీయ ప్రతినిధి యుధిస్తీర్ గోవింద దాస్ ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్డుపై వదిలేసిన, గాయపడిన లేదా వధ నుండి రక్షించబడిన ఆవులను తమ వద్దకు తీసుకొస్తారని, తాము వాటిని రక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. మేనకా గాంధీ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలను చూపించాలని ఇస్కాన్ డిమాండ్ చేసింది.