
మధ్యతరగతి ఇన్వెస్టర్ల డబ్బును కొల్లగొట్టడం దురదృష్టకరం; హిండెన్‌బర్గ్‌పై హరీష్ సాల్వే ఫైర్
ఈ వార్తాకథనం ఏంటి
అదానీ గ్రూప్ సంస్థలను టార్గెట్ చేసి, గత నెలలో మార్కెట్ ఒడిదుడుకులకు దారితీసిన అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికపై సమగ్ర దర్యాప్తు జరపాలని సీనియర్ న్యాయవాది, మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే కోరారు.
హిండెన్‌బర్గ్ అనేది అనైతి షార్ట్ సెల్లర్ అని హరీష్ సాల్వే వివరించారు. షేర్లను తగ్గించడం ద్వారా మధ్యతరగతి పెట్టుబడిదారుల సొమ్ముతో టన్నుల కొద్దీ డబ్బు ఎవరు సంపాదించారో సుప్రీంకోర్టు కమిటీ తేల్చాలని చెప్పారు.
అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంపై విచారించేందుకు రిటైర్డ్ జడ్జి అభయ్ మనోహర్ సప్రే నేతృత్వంలో సుప్రీంకోర్టు కమిటీ వేసిన విషయం తెలిసిందే.
హరీష్ సాల్వే
హిండెన్‌బర్గ్‌ను మార్కెట్ మానిప్యులేషన్‌గా పరిగణించాలి: హరీష్ సాల్వే
హిండెన్‌బర్గ్‌ను మార్కెట్ మానిప్యులేషన్‌గా పరిగణించాలని, ఇలాంటి కంపెనీలు ట్రేడింగ్ చేయకుండా నిషేధించాలని హరీష్ సాల్వే డిమాండ్ చేశారు.
మార్కెట్లో అవకతవకలు జరిగినట్లు తెలిస్తే సెబీకి కానీ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కానీ తెలియజేకుండా నేరుగా రిపోర్టులను విడుదల చేసి, దాడులకు పాల్పడటం ఏంటని హరీష్ సాల్వే ప్రశ్నించారు.
కంపెనీలను బెదిరించడానికి ఇలాంటి నివేదికలను ఉపయోగించబోతున్నట్లయితే, సెబీ చూస్తూ ఊరుకోదని చెప్పారు. వారు మధ్యతరగతి పెట్టుబడిదారులను దెబ్బతీసే వారి చరిత్రను సెబీ బయటికి తీస్తోందన్నారు.