Kangana Ranaut: 'ఇది చాలా చిన్న విషయం'.. జయా బచ్చన్ వివాదంపై కంగనా రనౌత్ స్పందన
పార్లమెంట్‌లో ఇటీవల జయా బచ్చన్ పేరు చుట్టూ నడిచిన వివాదంపై నటి, ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఈ అంశం గురించి కీలక వ్యాఖ్యలు చేసి, జయా బచ్చన్ వైఖరిని తప్పుబట్టారు. ఇది చాలా చిన్న విషయమని, స్త్రీ-పురుషులు కలిసి ఉంటేనే జీవితం అందంగా మారడానికి కారణమవుతుందన్నారు. ఇలాంటి చర్యలు స్త్రీవాదాన్ని పక్కదారి పడేస్తాయని కంగనా వ్యాఖ్యానించారు. ఈ విధమైన అహంకార వైఖరితో కుటుంబసభ్యుల మధ్య కూడా ఇబ్బందులు తలెత్తుతాయని, మన పేరు వెనుక మరొకరి పేరు రావడాన్ని కొందరు వివక్షగా చూస్తున్నారన్నారు.
సంబంధాలు దెబ్బతింటాయన్న కంగనా
దీనిని గౌరవించకుండా కఠిన వైఖరిని ఎంచుకుంటే, సంబంధాలు దెబ్బతింటాయని తెలిపారు. ఇటీవలి పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ జయా బచ్చన్‌ను "జయా అమితాబ్ బచ్చన్" అని సంబోధించిన విషయం తెలిసిందే. దీనిపై జయా బచ్చన్ అసహనం వ్యక్తం చేశారు. ఆమె "జయా బచ్చన్ అంటే సరిపోతుందంటూ పేర్కొన్నారు. కంగనా రనౌత్ తన తదుపరి చిత్రం 'ఎమర్జెన్సీ' ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఇందిరా గాంధీ రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని కంగనా స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. సెప్టెంబర్ 6న సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే సెన్సార్ సర్టిఫికేట్ ఆలస్యం కారణంగా రిలీజ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.