LOADING...
J&K: జమ్మూకశ్మీర్‌లో ఘోర బస్సు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 15 మంది దుర్మరణం
జమ్మూకశ్మీర్‌లో ఘోర బస్సు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 15 మంది దుర్మరణం

J&K: జమ్మూకశ్మీర్‌లో ఘోర బస్సు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 15 మంది దుర్మరణం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 20, 2026
11:56 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం అందరినీ తీవ్ర విషాదంలో ముంచింది. ఉధంపూర్‌-రామ్‌నగర్‌ మార్గంలో జాలో ప్రాంతం వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మారుమూల గ్రామం నుంచి ఉధంపూర్‌ వైపు బయలుదేరిన ఈ బస్సు, కాగోర్ట్ గ్రామం సమీపంలోని కొండ మార్గంలో ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురైంది. ఘాట్ రహదారిలో ఉన్న ప్రమాదకర మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు కొండపై నుంచి దొర్లుకుంటూ లోయలో పడిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

వివరాలు 

గాయపడిన వారికి ఉత్తమ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన లెఫ్టినెంట్ గవర్నర్

ప్రమాద విషయం తెలిసిన వెంటనే అధికారులు, స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఉధంపూర్‌ డీఐజీ శివకుమార్‌ శర్మ స్వయంగా అక్కడికి చేరుకుని సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. గాయపడిన వారిని తక్షణమే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, గాయపడిన వారికి ఉత్తమ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కొండ ప్రాంతాల్లో ప్రయాణం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన మరోసారి స్పష్టం చేసింది.

Advertisement