Jammu Kashmir Encounter: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. 5 మంది ఉగ్రవాదులు హతం.. ఇద్దరు సైనికులుకు గాయాలు
జమ్ముకశ్మీర్ మరోసారి కాల్పుల మోతతో కదలిక చెందింది. కుల్గాం జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో భద్రతా బలగాలు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాయి. టెర్రరిస్టులు తలదాచుకున్నారన్న సమాచారంతో భద్రతా దళాలు కుల్గాంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించగా, ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన జవాన్లు వారిపై ఎదురుదాడి చేసి ఐదుగురిని మట్టుబెట్టారు. అక్కడ ఇంకా ఉగ్రవాదులు ఉన్నారన్న అనుమానంతో భద్రతా బలగాలు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. CRPF,జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నారు. ఈ కాల్పుల ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు.
ఉగ్రవాదులు బలగాలపై కాల్పులు
బుధవారం రాత్రి బెహిబాగ్ ప్రాంతంలోని కద్దర్‌లో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఆ సమయంలో ఉగ్రవాదులు బలగాలపై కాల్పులు జరపగా, ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారిందని అధికారులు తెలిపారు. డిసెంబర్ 19, 2024న ఉగ్రవాదుల ఉనికిపై నిర్దిష్ట ఇంటెలిజెన్స్ ఆధారంగా భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కుల్గాంలో సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. అనుమానాస్పద చలనలు గమనించిన భద్రతా బలగాలు ఉగ్రవాదుల విచక్షణారహిత కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టాయని భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్స్ "ఎక్స్"లో ఓ పోస్ట్ ద్వారా వెల్లడించింది.
జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్
అమిత్ షా కీలక సమావేశం
ఇదిలా ఉండగా, జమ్మూ కాశ్మీర్ భద్రతా వ్యవస్థపై హోం మంత్రి అమిత్ షా కీలక సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత భద్రతా ఏర్పాట్లపై ఢిల్లీలో జరిగే ఈ సమావేశంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ, పారామిలటరీ బలగాల ప్రతినిధులు, జమ్మూ కాశ్మీర్ పరిపాలన అధికారులు, నిఘా సంస్థల ప్రతినిధులు హాజరవుతారు.