Speaker Ayyanna Patrudu: ప్రతిపక్ష హోదా జగన్‌కు లేదు.. ప్రజలు ఆ హోదా ఇవ్వలేదు
ఈ వార్తాకథనం ఏంటి
ఈ నెల 24వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
దీనికి ముందు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ వ్యవహారాలపై ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.
ఇందులో భాగంగా ఈ నెల 22, 23 తేదీల్లో ఎమ్మెల్యేలకు అసెంబ్లీ వ్యవహారాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈసారి ఎన్నికల్లో గెలిచిన వారిలో అధిక సంఖ్యలో కొత్త ఎమ్మెల్యేలు ఉన్నందున ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పీకర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా హాజరుకానుండగా, ముగింపు రోజున మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొంటారని తెలిపారు.
Details
జగన్ అసెంబ్లీకి రావట్లేదన్న స్పీకర్
సభలో పాల్గొనాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని మొదటి నుంచే కోరుతున్నానని, అయితే ఆయన అసెంబ్లీకి రాకపోవడం అర్థం కావడం లేదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభకు ఎంత సమయం కేటాయిస్తారో తనకూ అదే సమయం కావాలని జగన్ కోరుతున్నారని, అయితే ప్రజలు ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని స్పష్టంగా తెలిపారు.
ప్రతిపక్ష నేత హోదా పొందేందుకు 18 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సి ఉంటే, జగన్ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయని స్పీకర్ వివరించారు.
Details
కోర్టు సమన్లు అంశంపై రఘురామకృష్ణం రాజు స్పందన
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు మాట్లాడుతూ, హైకోర్టు ఏపీ స్పీకర్‌కి నోటీసులు పంపిందంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కోర్టులు స్పీకర్లకు సమన్లు జారీ చేయలేవని, జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేది జగన్ వ్యక్తిగత నిర్ణయమే అయినా, ఎమ్మెల్యేల అవగాహన సదస్సుకు హాజరుకావాలని కోరుతున్నానని ఆయన తెలిపారు.
ఎమ్మెల్యేల శాసన విధానాలు, ప్రవర్తన నియమావళిపై ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని అందజేయనున్నట్లు వివరించారు.
సభా సమావేశాలు హుందాగా సాగేందుకు ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు రఘురామ తెలిపారు.
శాసనసభ సభ్యుడు 60 రోజుల పాటు సమావేశాలకు హాజరుకాకపోతే సభ్యత్వం రద్దు అయ్యే అవకాశం ఉందని, అయితే ఇప్పటివరకు జగన్ సెలవు కోరుతూ ఎలాంటి లేఖ సమర్పించలేదని తెలిపారు.