జగిత్యాల: 12చేతి వేళ్లు, 12కాలి వేళ్లతో జన్మించిన శిశువు
కోరుట్ల ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ గర్భిణీకి 24 వేళ్లతో ఒక మగ శిశువు జన్మించాడు. నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం ఎరగట్లకు చెందిన సుంగారపు రవళి మొదటి ప్రసవం కోసం కోరుట్ల ఆసుపత్రిలో చేరింది. సాధారణ ప్రసవంలో ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ నవజాత శిశువుకు రెండు చేతులకు ఆరు చొప్పున, రెండు కాళ్లకు ఆరు చొప్పున వేళ్లు ఉండటం గమనార్హం.
తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు: వైద్యులు
24 వేళ్లతో శిశువు పుట్టడం చాలా అరుదని డాక్టర్లు చెబుతున్నారు. తల్లీబిడ్డల పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఇలా ఎక్కువ వేళ్లతో పుట్టడాన్ని వైద్య పరిభాషలో పాలీడాక్టిలీ కండిషన్ అని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. పాలిడాక్టిలీ కండిషన్‌తో జన్మించిన శిశువుల గుండెలో రంధ్రం ఉండే అవకాశం ఉందని వారు తెలిపారు. రవళికి పురిటి నొప్పులు రావడంతో తొలుత మెట్‌పల్లి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కోరుట్ల ఆస్పత్రికి తరలించారు.