Jaishankar: ఉగ్రవాద అతిపెద్ద బాధిత దేశం భారత్.. తీవ్రవాదంపై కఠినంగానే ఉంటాం: జైశంకర్
భోపాల్‌లోని టౌన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఉగ్రవాదంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదంపై భారత్ కఠిన వైఖరి అవలంబిస్తోందన్నారు. ఐక్యరాజ్య సమితి (ఐరాస)లో హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని దేశంలోని కొన్ని ప్రతిపక్ష పార్టీలు తప్పుబట్టాయి. ఈ క్రమంలో ఐరాసలో భారత్ తీసుకున్న నిర్ణయంపై ఎస్ జైశంకర్ వివరణ ఇచ్చారు. ఐరాస ప్రతిపాదనలో కాల్పుల విరమణ కోసం మాత్రమే విజ్ఞప్తి చేశారని, కానీ అందులో హమాస్ ప్రస్తావన లేదన్నారు. నేటి సామాజిక-రాజకీయ వాతావరణంలో ఉగ్రవాదంపై స్థిరమైన వైఖరి అవలంబించాల్సిన అవసరం ఉందని జైశంకర్ ఉద్ఘాటించారు.
సుపరిపాలన ఎంత ముఖ్యమో.. సరైన విదేశీ విధానం కూడా అంతే ముఖ్యం: జైశంకర్
స్వదేశంలో సుపరిపాలన ఎంత ముఖ్యమో, విదేశాల్లో కూడా సరైన నిర్ణయాలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యమని జైశంకర్ పేర్కొన్నారు. తీవ్రవాద అతిపెద్ద బాధిత దేశం భారత్ అని, అందుకే ఉగ్రవాదంపై బలమైన వైఖరిని అవసరం అన్నారు. ఉగ్రవాదం మనపై ప్రభావం చూపినప్పుడు అది చాలా తీవ్రమైనదని చెప్పి.. వేరొక దేశంపై జరిగినప్పుడు దాన్ని చిన్న అంశంగా చూడటం సరైన విధానం కాదన్నారు. ఉగ్రవాదంపై స్థిరమైన అభిప్రాయం అవసరమని నొక్కి చెప్పారు. ఇది విశ్వసనీయతకు సంబంధించిన అంశం అన్నారు. గత కొన్ని దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ముఖచిత్రం మారిపోయిందన్నారు. కరోనా సమయంలో ప్రపంచం మొత్తం ఒత్తిడికి గురైనా.. భారత్ మాత్రం ధైర్యంగా నిలిబడిందన్నారు.