Jammu and Kashmir : జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు.. అరుపులు, తోపులాటలు..గందరగోళం
జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో ఆర్టికల్ 370 పునరుద్ధరణపై ఈ రోజు మరోసారి గందరగోళం నెలకొంది. కుప్వారాకు చెందిన పీడీపీ ఎమ్మెల్యే ఆర్టికల్ 370 పునరుద్ధరణకు సంబంధించిన బ్యానర్ ప్రదర్శించడంతో సభలో హంగామా మొదలైంది. ఈ సంఘటనతో మళ్లీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది, కాగా బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. తోపులాటలో అవామీ ఇత్తెహాద్ పార్టీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్‌ను మార్షల్స్ సభ నుంచి బయటకు పంపించారు. పీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు జరగడం గమనార్హం. గత గురువారం కూడా ఇదే తరహాలో సభలో దుమారం చెలరేగింది, ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది.
బీజేపీ ఎమ్మెల్యేలను బయటకు పంపించిన మార్షల్స్
స్పీకర్ అబ్దుల్ రహీమ్ రాథర్ ఆదేశాలతో బీజేపీ ఎమ్మెల్యేలను సభ వెల్ నుంచి మార్షల్స్ బయటకు పంపించారు. పీడీపీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ (PC) వంటి పార్టీలు ఆర్టికల్ 370, 35Aలను పునరుద్ధరించాలని కోరుతూ కొత్త తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ తీర్మానం NC ఆమోదించిన తీర్మానం తరువాతి రోజు సభ ముందు వచ్చింది. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 ప్రకారం కేంద్రం ఆర్టికల్ 370, 35Aలను రద్దు చేసిన తీరును ఈ తీర్మానం తీవ్రంగా ఖండించింది. ఈ చర్యలు జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను తొలగించడమే కాకుండా, ప్రాంత ప్రజలకు మంజూరు చేసిన ప్రధాన రక్షణలను బలహీనపరిచాయని తీర్మానంలో పేర్కొంది.