
Jammu and Kashmir on high alert: రాజౌరీ, ఉధంపూర్ జిల్లాల్లో తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున తీవ్రవాద వ్యతిరేక చర్యలు చేపట్టాయి. రాష్ట్రంలో ఉగ్రవాదులను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా రాజౌరీ, ఉధంపూర్ జిల్లాల్లో ఈ ఆపరేషన్లు జరుగుతున్నాయి. మొదటగా రాజౌరీ జిల్లాలో ఈ చర్యలు ప్రారంభమయ్యాయి. మంగళవారం రాత్రి రాజౌరీ జిల్లాలోని కాండీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బీరంతుబ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, జమ్మూ కశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) మధ్య తీవ్ర కాల్పులు జరిగాయి. విశ్వసనీయ సమాచారం మేరకు ఆ ప్రాంతంలో ముగ్గురు నుంచి నలుగురు వరకు భారీ ఆయుధాలతో ఉన్న ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారం లభించడంతో బలగాలు అప్రమత్తమయ్యాయి.
వివరాలు
రెండో ఆపరేషన్ ఉధంపూర్ జిల్లాలో..
సమాచారం అందుకున్న వెంటనే భద్రతా బలగాలు సంయుక్తంగా సర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలను గమనించిన ఉగ్రవాదులు ఆకస్మికంగా కాల్పులు ప్రారంభించారని,దాంతో ఆ పరిసరాల్లో కాల్పుల మోత మ్రోగిందని అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉగ్రవాదులను పూర్తిగా అదుపులోకి తీసుకుని నిర్వీర్యం చేసే వరకు భద్రతా దళాలు అక్కడే మోహరించి ఉంటాయి. పరిస్థితిని పూర్తిగా నియంత్రణలోకి తెచ్చే దాకా ఆ ప్రాంతంలో జాగ్రత్త చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఇక రెండో ఆపరేషన్ ఉధంపూర్ జిల్లాలోని బసంత్‌గఢ్ ప్రాంతంలోని ధర్ణీ టాప్ పర్వత ప్రాంతంలో జరుగుతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడ ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు అరణ్యప్రాంతం గుండా కదులుతున్నట్లు బలగాలకు సమాచారం అందింది.
వివరాలు
హెలికాప్టర్ల సహాయంతో సోదాలు
దీనిపై స్పందించిన జమ్మూ కశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, పరామిలిటరీ దళాలు సంయుక్త బృందంగా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఆపరేషన్ ప్రారంభించాయి. ఉగ్రవాదులు తప్పించుకోకుండా మొత్తం ప్రాంతాన్నే సీజ్ చేశారు. గగనతలంలో హెలికాప్టర్ల సహాయంతో పాటు, భూభాగంలో సైనిక దళాలు అడుగు అడుగుకీ సోదాలు కొనసాగిస్తున్నాయి. అధికారుల సమాచారం ప్రకారం, అడవి ప్రాంతం కఠినంగా ఉండడం వల్ల సోదాలు జాగ్రత్తగా జరుగుతున్నాయి. భద్రతా బలగాలు ఎలాంటి ప్రమాదమూ జరగకుండా క్షేత్రస్థాయిలో నిఘా కట్టుదిట్టం చేశాయి. ఉగ్రవాదులను పట్టుకోవడం లేదా నిర్వీర్యం చేసే వరకూ ఈ ఆపరేషన్ కొనసాగుతుందని సైనిక అధికారులు వెల్లడించారు.