JammuKashmir: ఆర్టికల్ 370 తొలగింపుకు వ్యతిరేకంగా PDP ఎమ్మెల్యే ప్రతిపాదన.. వ్యతిరేకించిన ఒమర్ అబ్దుల్లా
ఆరేళ్ల విరామం తర్వాత తిరిగి ప్రారంభమైన జమ్ముకశ్మీర్ అసెంబ్లీ సమావేశాల్లో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. సోమవారం జరిగిన తొలి సమావేశంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) ఎమ్మెల్యే వహీద్ పర్రా, ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారిక నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన స్పీకర్ రహీమ్ రాథర్, తాను ఆ తీర్మానాన్ని ఇంకా ఆమోదించలేదని ప్రకటించడంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.
మ్మూ కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా ఇవ్వాలని ఒమర్ అబ్దుల్లా డిమాండ్
కేంద్రం 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో, జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదా కోల్పోయింది. ఆ తరువాత ఆ ప్రాంతం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించబడింది. జమ్మూ కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా ఇవ్వాలని, ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. ఈ నేపధ్యంలో ఒమర్ అబ్దుల్లా కూడా గత కొంతకాలంగా ఈ లక్ష్యం సాధన కోసం కృషి చేస్తున్నారు.
కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చే అవకాశం
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్‌సీ-కాంగ్రెస్ కూటమి విజయవంతమైంది. మొత్తం 90 స్థానాల అసెంబ్లీలో ఎన్‌సీ 42 స్థానాల్లో, కాంగ్రెస్ 6 స్థానాల్లో విజయం సాధించాయి. ఈ విజయం తరువాత నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కేంద్రాన్ని ఉద్దేశించి జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని ఒమర్ మంత్రివర్గం తీర్మానం చేయగా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదం కూడా తెలిపారు. ఈ పునరుద్ధరణపై కేంద్రం నుంచి సానుకూల స్పందన రావచ్చని పలు వార్తా కథనాలు సూచిస్తున్నాయి.