Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీపై జనసేన నేతల ఫైర్.. దువ్వాడపై పోలీసులకు ఫిర్యాదులు..
ఈ వార్తాకథనం ఏంటి
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆ పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒకవైపు దువ్వాడ శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూనే, మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఆయనపై ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు.
వివరాలు
పోలీసులకు వరుస ఫిర్యాదులు
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో జనసేన నాయకులు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై ఫిర్యాదు చేశారు.
పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించకుండా ఉండేందుకు రూ.50 కోట్లు తీసుకున్నాడని ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు జనసేన నేతలు విజ్ఞప్తి చేశారు.
దువ్వాడ శ్రీనివాస్‌పై అవనిగడ్డ, మచిలీపట్నం, తిరువూరు, పెడన, పామర్రు, గుడివాడ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి.
వివరాలు
జనసేన మహిళా కౌన్సిలర్ల ఆందోళన
దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన జనసేన మహిళా కౌన్సిలర్లు, ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలపై తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు.