LOADING...
Pawan Kalyan: తెలంగాణలో జనసేన ఎంట్రీ ఖాయం.. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తా: పవన్ కళ్యాణ్
తెలంగాణలో జనసేన ఎంట్రీ ఖాయం.. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తా: పవన్ కళ్యాణ్

Pawan Kalyan: తెలంగాణలో జనసేన ఎంట్రీ ఖాయం.. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తా: పవన్ కళ్యాణ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 02, 2026
06:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో పలు కీలక అంశాలపై స్పందించారు. జనసేన పార్టీ ఎలాంటి బెదిరింపులకు భయపడదని స్పష్టం చేసిన ఆయన, తనపై వస్తున్న భూమి ఆక్రమణ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తాను చెరువు లేదా ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు నిరూపిస్తే, ఆ భూమిని తెలంగాణ ప్రభుత్వానికి రాసి ఇస్తానని సవాల్ విసిరారు. తనపై చెరువు భూమిని ఆక్రమించుకున్నానంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ పవన్, ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. తాను ఒక్క రూపాయి విలువైన భూమినైనా అక్రమంగా ఆక్రమించినట్లు తేలితే, ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవచ్చని పేర్కొన్నారు.

వివరాలు

ఇలాంటి బెదరింపులకు భయపడను

ఈ సందర్భంగా ప్రజా గాయకుడు గద్దర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గద్దర్ జీవించి ఉన్న సమయంలో ఇప్పుడు తనను విమర్శిస్తున్న నాయకులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. గద్దర్ కోరిన రెండు రోజుల వ్యవధిలోనే తన సొంత డబ్బులతో ఆయనకు బండి కొనిచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. అలాగే తాను తెలంగాణ ఉద్యమానికి ఎప్పుడూ వ్యతిరేకం కాదని, రాష్ట్ర విభజన జరిగిన విధానాన్ని మాత్రమే విమర్శించానని స్పష్టం చేశారు. తెలంగాణలో తన రాజకీయ కార్యకలాపాలపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ, "హైదరాబాద్‌లో ఎలా అడుగుపెడతావ్? నీకు ఇక్కడ ఏం పని?" అని కొందరు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఎవరి వ్యక్తిగత జాగీరు కాదని, ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనని స్పష్టం చేశారు.

వివరాలు

జనసేనను బలోపేతం చేస్తా

ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణలో తనకు బెదిరింపులు తక్కువేనని, ఇక్కడి యువత భవిష్యత్తు బాగుండాలని కోరుకునే తొలి వ్యక్తిని తానేనని పేర్కొన్నారు. జనసేన పార్టీని తెలంగాణ గడ్డపైనే స్థాపించామని గుర్తు చేసిన పవన్, ఆంధ్రప్రదేశ్‌లో తాను పర్యటించేందుకు ఉపయోగిస్తున్న వారాహి వాహనానికి తొలి అనుమతి కూడా తెలంగాణ ప్రజల నుంచే వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజల ప్రేమ, ఆదరణ తనకు ఎల్లప్పుడూ ఉంటాయని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. తెలంగాణలో జనసేనను బలోపేతం చేయాలని పార్టీ నాయకులు చాలా కాలంగా కోరుతున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోనే పదవులు, అధికారాల కోసం తాను ప్రయత్నించలేదని, తెలంగాణలో అధికారం కోసం ఎందుకు ఆరాటపడతానని ప్రశ్నించారు. తనకు సీట్లపై మోజు లేదని, సమాజంలో మార్పు తీసుకురావడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

Advertisement

వివరాలు

తెలంగాణ నలుమూలలా పర్యటించా

ఏపీలో ముఖ్యమంత్రికే అనేక సవాళ్లు ఉన్నప్పుడు, తెలంగాణలో అధికారంపై ఎందుకు దృష్టి పెడతానని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల మనస్తత్వం విశాలమైందని, వారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఎలాంటి ద్వేషం లేదని పవన్ అన్నారు. ఒకవేళ విద్వేషం ఉంటే హైదరాబాద్‌లో ఏపీకి చెందిన ప్రజలు ప్రశాంతంగా జీవించలేకపోయేవారని పేర్కొన్నారు. ప్రస్తుతం తనను విమర్శిస్తున్న నాయకులు కనీసం ఆదిలాబాద్ అడవుల్లో కూడా తిరిగి ఉండరని, తాను మాత్రం తెలంగాణ నలుమూలలా పర్యటించిన వ్యక్తినని చెప్పారు. ఇప్పటి వరకు తెలంగాణ రాజకీయాల్లో పూర్తిస్థాయిలో యాక్టివ్‌గా ఉండాలా వద్దా అనే విషయంలో కొంత సందిగ్ధత ఉందని, అయితే విమర్శల కారణంగా ఇప్పుడు ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చానని వెల్లడించారు

Advertisement

వివరాలు

సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్

. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన తప్పకుండా పోటీ చేస్తుందని ప్రకటించారు. అంతేకాకుండా తానే స్వయంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజా సమస్యలపై పోరాడతానని, ప్రతి అన్యాయాన్ని ప్రశ్నిస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ కూడా భారతదేశంలో అంతర్భాగమేనని, ఎవరికీ భయపడబోమని పేర్కొన్నారు. తనపై వచ్చిన భూమి ఆక్రమణ ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. తాను చెరువును ఆక్రమించినట్లు నిరూపితమైతే, ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని అన్నారు. ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కోరారు.

వివరాలు

విద్వేషాలను రెచ్చగొట్టద్దు

చివరిగా రాష్ట్ర విభజన అనంతర పరిస్థితులపై స్పందించిన పవన్, మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి చొరవ వల్లే సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చిందని గుర్తు చేశారు. హైదరాబాద్ దాదాపు 50 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా సేవలందించిందన్నారు. పాలకుల తప్పిదాలకు ప్రజలను బాధ్యులను చేయకూడదని, రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఇలాంటి విభజనాత్మక రాజకీయాల వల్లే కమ్యూనిజం బలహీనపడిందని ఎద్దేవా చేశారు.

Advertisement