Page Loader
Srikalahasti: హత్యకేసులో జనసేన శ్రీకాళహస్తి ఇన్‌ఛార్జి వినుత అరెస్ట్‌!
హత్యకేసులో జనసేన శ్రీకాళహస్తి ఇన్‌ఛార్జి వినుత అరెస్ట్‌!

Srikalahasti: హత్యకేసులో జనసేన శ్రీకాళహస్తి ఇన్‌ఛార్జి వినుత అరెస్ట్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 13, 2025
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

చైన్నైలోని కూవం నది వద్ద గుర్తించిన ఓ యువకుడి మృతదేహం కేసు తెలుగురాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన యువకుడిని హత్య చేసి మృతదేహాన్ని చెన్నైకు తరలించిన ఘటనలో జనసేన పార్టీ శ్రీకాళహస్తి ఇన్‌ఛార్జి వినుత కోటా, ఆమె భర్త చంద్రబాబు సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు చెన్నై పోలీసు కమిషనర్ అరుణ్ శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. జూలై 8న చెన్నై సెవెన్ వెల్స్‌లోని ఎంఎస్ నగర్ హౌసింగ్ బోర్డు వెనుకభాగంలో ఉన్న కూవం నదిలో ఓ యువకుడి (వయసు సుమారు 25) మృతదేహం తేలియాడుతూ గుర్తించారు. శరీరంపై గాయాలుండటంతో హత్య కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

Details

సెల్‌ఫోన్‌ వీడియో దుమారం

మృతుడు శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలెం గ్రామానికి చెందిన రాయుడు(22)గా గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం, వినుత పడకగదిలో దుస్తులు మార్చుకుంటున్న సమయంలో మంచం కింద ఉన్న సెల్‌ఫోన్ గుర్తించి, అది శ్రీనివాసులునిదని తెలుసుకున్నారు. అతను మొబైల్‌లో ఏమీ చిత్రీకరించాడనే అనుమానంతో దంపతులు శ్రీనివాసులును హెచ్చరించారు. అనంతరం అతను ఆ వీడియోల్ని అధికార పార్టీకి చెందిన నాయకుల అనుచరులకు నగదు కోసం ఇచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో జూన్ 21న అతనిని ఇంటికి పిలిపించి నాలుగు రోజుల పాటు నిర్బంధించి శారీరకంగా హింసించినట్లు పోలీసులు వెల్లడించారు. జూలై 7న బాత్రూమ్‌కు వెళ్లిన శ్రీనివాసులు బయటకు రాకపోవడంతో, తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లిన దంపతులు ఇనుప గొలుసుతో అతని గొంతు నులిమి హత్య చేశారని చెబుతున్నారు.

Details

పదేళ్ల పనిచేసిన అనుభవం

మృతదేహాన్ని అదేరోజు కారులో తీసుకెళ్లి, చెన్నై కూవం నదిలో పడేశారు. ప్రయాణమధ్య వాహనం మొరాయించడంతో మరో కారు మార్చుకొని ఆపరేషన్‌ను కొనసాగించినట్లు సమాచారం. శ్రీనివాసులు గత 10 ఏళ్లుగా వినుత, చంద్రబాబు దంపతుల వద్ద సహాయకుడిగా, డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. జూన్ 21న అతన్ని డ్రైవర్‌గా తొలగించిన విషయాన్ని దంపతులు స్థానిక వాట్సాప్ గ్రూప్‌లలో వెల్లడించారు. ప్రత్యర్థులకు లొంగిపోయాడని, తమకు నష్టం చేశాడని ఆరోపించారు.

Details

పార్టీ నుంచి బహిష్కరణ

ఈ సంఘటనపై స్పందించిన జనసేన పార్టీ, తమ విధివిధానాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణంగా వినుతను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. జనసేన కాన్ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్ హెడ్ వేములపాటి అజయ్‌కుమార్ ఈ ప్రకటన చేశారు. మరోవైపు అరెస్టు సమయంలో దంపతులు "ఇందుకు కారణం బొజ్జల సుధీర్‌రెడ్డి.. నిజాలు త్వరలో వెలుగు చూస్తాయి" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పోలీసులు శ్రీకాళహస్తిలో మరిన్ని ఆధారాలను సేకరిస్తుండగా, ఈ కేసు మరింత గంభీరతను సంతరించుకుంది.