Janardan Bapurao Bothe: గ్రామీణ అభ్యున్నతికి 60 ఏళ్ల సేవ.. జనార్దన్ బాపూరావ్ బోతేకు పద్మశ్రీ
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రకు చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు జనార్దన్ బాపూరావ్ బోతేకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక 'పద్మశ్రీ' పురస్కారాన్ని ప్రకటించింది. మే 25న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు ఈ అవార్డును అందజేయనున్నారు. 'జనార్దన్ గురూజీ', 'జనార్దన్‌పంత్ బోతే'గా ప్రసిద్ధి చెందిన 86 ఏళ్ల బోతే గత ఆరు దశాబ్దాలుగా గ్రామీణాభివృద్ధి, విద్య, సామాజిక సేవ రంగాల్లో విశేషంగా పనిచేస్తున్నారు.
వివరాలు
తుకడోజీ మహారాజ్ ప్రభావంతో సేవా మార్గం
1939 నవంబర్ 25న మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో మోగారి గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో బోతే జన్మించారు. చిన్నప్పటి నుంచే రాష్ట్రసంత్ తుక్డోజీ మహారాజ్ ప్రభావంలో పెరిగిన ఆయన, 1954 నుంచి మహారాజ్ సాన్నిధ్యంలో కొనసాగారు. తరువాత ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తూ దేశవ్యాప్తంగా పర్యటించారు. మహారాజ్ అనారోగ్య సమయంలో సేవలు అందించడంతో పాటు, ఆయన గ్రామాభివృద్ధి సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు.
వివరాలు
గ్రామీణ స్వావలంబనకు కృషి
1972లో బోతే 'రాష్ట్రసంత్ తుకడోజీ మహారాజ్ విద్యాసంస్థ'ను స్థాపించి, గిరిజన, వెనుకబడిన ప్రాంతాల్లో 11 హాస్టళ్లను ప్రారంభించారు. వేలాది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నారు. గ్రామ స్వావలంబన, పరిశుభ్రత, సామాజిక ఐక్యత వంటి గ్రామగీత సిద్ధాంతాలను గ్రామాల వరకు తీసుకెళ్లారు. ప్రస్తుతం 10 వేలకుపైగా గ్రామ శాఖలు, 850కిపైగా మహిళా మండళ్లు ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి.
వివరాలు
మద్యనిషేధం నుంచి మరుగుదొడ్ల నిర్మాణం వరకు..
గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించిన బోతే, మద్యనిషేధ ప్రచారాలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, జాతీయ ఐక్యత వారోత్సవాల నిర్వహణలో కూడా ముందున్నారు. గ్రామీణ సమాజంలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు.
వివరాలు
భారత్-చైనా యుద్ధ సమయంలో సైనికులకు ప్రోత్సాహం
1962 భారత్-చైనా యుద్ధ సమయంలో భారత సైనికుల మనోధైర్యాన్ని పెంచేందుకు బోతే ప్రత్యేక భజన కార్యక్రమాలు నిర్వహించారు. NEFA సరిహద్దు ప్రాంతంలో సైనికులకు ఆధ్యాత్మిక ప్రేరణ ఇచ్చారు. సామాజిక సేవలో ఆయన కృషికి గాను ఇప్పటికే పలు పురస్కారాలు లభించాయి. 1992లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత మిత్ర పురస్కారం, 2008లో మరాఠా విదర్భ భూషణ్ అవార్డులతో సత్కరించారు.
వివరాలు
మహారాష్ట్ర నుంచి 15 మందికి పద్మ పురస్కారాలు
ఈసారి కేంద్ర ప్రభుత్వం '#PeoplesPadma' భావనతో గ్రామీణ ప్రాంతాల్లో నిస్వార్థంగా సేవ చేస్తున్న వ్యక్తులకు ప్రాధాన్యం ఇచ్చింది. దేశవ్యాప్తంగా 84 జిల్లాల నుంచి 131 మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేశారు. ఇందులో 5 మందికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు. మహారాష్ట్ర నుంచి మొత్తం 15 మంది ఈ గౌరవాన్ని అందుకోనున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గ్రామీణ స్వావలంబన కోసం కృషి చేసిన బోతేకు కేంద్ర గౌరవం
सामाजिक सेवा, ग्रामीण उत्थान और ग्रामगीता दर्शन के प्रसार में उल्लेखनीय योगदान देने वाले जनार्दन बापुराव बोथे को पद्म श्री से सम्मानित किया जाएगा।#PeoplesPadma #PadmaAwards2026 @HMOIndia @PadmaAwards @MSJEGOI @PIBMumbai @airnews_mumbai pic.twitter.com/GpNpDZjaOK
— PIB in Uttar Pradesh (@PibLucknow) May 21, 2026