AP News: PAC ఛైర్మన్‌గా జనసేన ఎమ్మెల్యే రామాంజనేయులు?
భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్‌గా ఎంపిక అవ్వడం దాదాపు ఖరారైంది. ఇప్పటికే మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రామాంజనేయులు ఈ పదవికి అర్హత సాధించారు. వైసీపీ నామినేషన్ ఉపసంహరణ జరగకపోతే, శుక్రవారం అసెంబ్లీ కమిటీహాల్‌లో పీఏసీ సభ్యత్వానికి పోలింగ్ జరగనుంది. ఈ ప్రక్రియ బ్యాలెట్ విధానంలోనే నిర్వహించనున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున పీఏసీ సభ్యత్వానికి పలు నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్,ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు,వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి నామినేషన్‌లు దాఖలు చేశారు.
వైసీపీకి తగినంత సంఖ్యాబలం లేకపోవడం.. ఎన్నిక సులభం
జనసేన తరఫున పులపర్తి రామాంజనేయులు నామినేషన్ దాఖలు చేయగా, బీజేపీ తరఫున విష్ణు కుమార్ రాజు పోటీ చేస్తున్నారు. వైసీపీ తరఫున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేశారు. అయితే, వైసీపీకి తగినంత సంఖ్యాబలం లేకపోవడం వల్ల ఎన్డీయే అభ్యర్థుల ఎన్నిక సులభంగా పూర్తవుతుందని అంచనా. ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యాక, పీఏసీ చైర్మన్‌గా పులపర్తి రామాంజనేయుల పేరును స్పీకర్ ప్రకటించనున్నారు. అదనంగా, ప్రభుత్వరంగ సంస్థల కమిటీ (పీయూసీ) చైర్మన్‌గా ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, అంచనాల కమిటీ (ఎస్టిమేట్స్) చైర్మన్‌గా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు నియామకమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.