Janwada Farm House: మరికాసేపట్లో కేటీఆర్ ఫామ్‌హౌస్ కూల్చివేత.. సర్వే పూర్తి చేసిన అధికారులు!
హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఉపయోగిస్తున్న జన్వాడ ఫాం హౌస్ గురించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఫాం హౌస్ కుల్చివేసే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హైడ్రా అధికారులు ఇప్పటికే అక్కడికి చేరుకుని సర్వే పూర్తి చేసినట్లు సమాచారం. జన్వాడ ఫాం హౌస్ మాత్రమే కాకుండా, మరికొంత మంది ప్రముఖులకి సంబంధించిన ఫాం హౌస్‌లు కూడా నిబంధనలు ఉల్లంఘించారని అధికారులు గుర్తించారు.
ఫామ్ హౌస్ తనది కాదన్న కేటీఆర్
జన్వాడ ఫాం హౌస్‌పై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఇటీవల సర్వే చేయగా, ఈ సర్వే ఆధారంగా హైడ్రా అధికారులు కూల్చివేతకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ కూల్చివేత ఎప్పుడు జరుగుతుందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు, ఈ ఫాం హౌస్ తన సొంతం కాదని కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు. జన్వాడ ఫాం హౌస్ నా స్నేహితుడిదే, ఫామ్ హౌజ్ ఎఫ్‌టీఎల్ లేదా బఫర్ జోన్‌లో ఉంటే తానే దగ్గర్నుండి కూలగొట్టిస్తానని ఆయన స్పష్టం చేశారు.